భాగ్యనగరిపై ఐఎస్‌ పెను కుట్ర భగ్నం Let's be careful.

Hyderabad

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌లో శనివారం, ఆదివారం పేలుళ్లు జరిగి ఉంటే, భారత గడ్డపై ఐఎస్‌ సాగించిన మొట్టమొదటి పేలుళ్లు ఇవే అయి ఉండేవి. కానీ, అవి జరగడానికి రెండు మూడు రోజుల ముందే ఎన్‌ఐఏ అధికారులు విజయవంతంగా వాటిని భగ్నం చేశారు. సాధారణంగా ఇప్పటి వరకూ ఉగ్రవాదులు దాడులు చేయడానికి గురు, శుక్రవారాలను ఎంచుకున్నారు. కానీ, ఈసారి అందుకు భిన్నంగా శని, ఆదివారాలను టార్గెట్‌ చేశారు. గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో కార్యకలాపాలు ఉండకపోవడం, ఆ రోజుల్లో ఐటీ ఉద్యోగులంతా ఔటింగ్‌కు రావడమే ఇందుకు కారణమని భద్రతా బలగాలు వివరిస్తున్నాయి. పేలుళ్లు జరిపిన తర్వాత పోలీసులంతా భద్రతా హడావుడిలో ఉంటారు. భద్రతా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఈ సమయంలోనే, నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లపై కూడా దాడులు జరపాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బాంబుల తయారీకి అవసరమైన రసాయనిక పదార్థాలను హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో కొనుగోలు చేశారు. అలాగే, ఇబ్రహీం యాజ్దానీ, ఫాహిద్‌ కలిసి అజ్మీర్‌ వెళ్లారు. అలాగే, బైకు మీద మహారాష్ట్రలోని నాందేడ్‌ వెళ్లారు. అక్కడ రెండు 9 ఎంఎం పిస్టల్స్‌ను, ఒక ఎయిర్‌ గన్‌ను కొనుగోలు చేశారు.
దవా రెడీ.. సిరంజ్‌ ఆగయా.. టాబ్లెట్‌ మిల్‌గయా! 
దవా రెడీ.. సిరంజ్‌ ఆగయా.. టాబ్లెట్‌ మిల్‌గయా.. భారీ విధ్వంస రచనకు ఉగ్రవాదులు వాడిన కోడ్‌ భాష ఇది. అంతేనా.. ‘మాల్‌ తయ్యార్‌ హో గయా, అబ్‌ క్యా కర్నా హై’ అంటూ దిశానిర్దేశం చేయాలని సిరియాలోని తమ ఉగ్ర నేతలను కోరారు. అత్యంత శక్తిమంతమైన 40-50 బాంబుల తయారీకి అవసరమైన సరంజామా సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సిరియా నుంచి ఉగ్ర దాడులను పర్యవేక్షిస్తున్న ‘ఆమిర్‌’ను కోరారు. భారతలో ఐఎస్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న షాఫీ అర్మార్‌ ఈ ఆమిర్‌ అయి ఉంటాడని ఎన్‌ఐఏ అధికారులు భావిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇతడిని యూసుఫ్‌ అల్‌ హిందీగా పిలుస్తారు. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కీ‘లక వ్యక్తులతో ఫోన్లలో జరిపిన సంభాషణ ఎన్‌ఐఏ అధికారులు ఈ కుట్రను ఛేదించడానికి పనికి వచ్చింది. నిజానికి, దేశవ్యాప్తంగా చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఐఎ్‌సపై నిఘా సంస్థలు ఎప్పటినుంచో కన్నేశాయి. ఏడాదినుంచి పూర్తిస్థాయిలో దృష్టిసారించాయి. హైదరాబాద్‌ నుంచి పదుల సంఖ్యలో యువత ఐఎ్‌సకు ఆకర్షితులవుతున్నారనే సమాచారంతో అప్రమత్తమయ్యాయి. ఇక్కడి సోషల్‌ మీడియా, ఇక్కడి నుంచి సిరియా తదితర ప్రాంతాలకు వెళ్లే ఫోన్‌ కాల్స్‌పై నిఘా వేశాయి. ఉగ్రవాద వెబ్‌సైట్లపై కన్నేశాయి. ఈ క్రమంలోనే, హైదరాబాద్‌ నుంచి ఉగ్రవాదులు సిరియాలోని ఉగ్రవాదులతో మాట్లాడిన మాటలను ట్రాప్‌ చేశాయి. దవా, సిరంజీ అంటూ ఉగ్రవాదులు వాడిన కోడ్‌ భాషను క్రోడీకరించుకుని, ఉగ్ర కుట్రపై అంచనాకు వచ్చారు. ఉగ్రవాదులు దాదాపు 40 ఫోన్స్‌, 32 సిమ్‌ కార్డులు ఉపయోగించి సిమ్‌లను మార్చి మార్చి ఫోన్లు చేస్తూ వస్తున్నారు. దాంతో దాదాపు మూడు నెలలుగా సిరియా వెళ్లే అన్ని కాల్స్‌పైనా నిఘా ఉంచిన ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌లో మారణ హోమానికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని పాత బస్తీ నుంచి సిరియాకు ఫోన్‌ కాల్స్‌ వెళుతున్నాయని గుర్తించిన ఎన్‌ఐఏ అధికారులు మఫ్టీలో హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణ పోలీసులకు తెలియకుండానే పాతబస్తీలో కలియదిరిగారు. దాడులు చేయడానికి వీలుగా, ఫోన్‌ కాల్స్‌ వెళుతున్న ఇళ్లు, ప్రాంతాలను పక్కాగా గుర్తించారు. ఆయా ఇళ్ల నుంచే సిరియాకు ఫోన్లు వెళుతున్నాయని నిర్థారించుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారితో కలిసి బుధవారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు చేశారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, రంజాన్‌ మాసం నేపథ్యంలో యాజ్దానీ సోదరులు ఇద్దరూ మసీదులో ప్రార్థనలను ముగించుకుని అప్పుడే ఇంటికి వచ్చి కూర్చున్నారు. వారు వచ్చి అలా కూర్చున్న వెంటనే ఎన్‌ఐఏ, పోలీసు బృందం దాడి చేసింది.

టార్గెట్‌ రాజాసింగ్‌!! 
గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హత్య చేసేందుకు కూడా ఐఎస్‌ ఉగ్రవాదులు పావులు కదిపినట్లు పోలీసు వర్గాలు వివరించాయి. హనుమాన్‌ శోభాయాత్ర వంటి హిందూ అనుకూల కార్యక్రమాల్లో క్రియాశీలంగా ఉండే రాజాసింగ్‌ను ఐఎస్‌ ఉగ్రవాదులు టార్గెట్‌ చేసినట్లు విచారణలో తెలిపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఆయన ఇంటి వద్ద కూడా రెక్కీ జరిపినట్లు పేర్కొన్నాయి. 

మత కల్లోలాలకూ 
ఉగ్రవాదులు హైదరాబాద్‌లో మత కల్లోలాలు చేయడానికి కూడా కుట్ర పన్నారని ఎన్‌ఐఏ అధికారి ఒకరు వివరించారు. రంజాన్‌ నెలలో, చార్మినార్‌ను ఆనుకుని ఉండే భాగ్యలక్ష్మి ఆలయం సహా వివిధ ప్రాంతాల్లో ఆవు, గేదె మాంసం ఉంచాలని ఉగ్రవాదులు నిర్ణయించారు. ఈ మేరకు జూన్‌ 25వ తేదీన సిరియాలోని ఉగ్రవాదులతో హైదరాబాద్‌ నుంచి మాట్లాడారు. తమ వ్యూహాన్ని వివరించారు. అలాగే, హైదరాబాద్‌లోని ఉగ్రవాదులు ఒకరితో మరొకరు మాట్లాడుకున్న సంభాషణను కూడా ఎన్‌ఐఏ ట్రాప్‌ చేసింది. ‘‘ఆరోజు నాలుగు ముక్కలు ఆవు మాంసం, ఐదు ముక్కలు గేదె మాంసం తీసుకురా. ఆ తర్వాతి రోజు ఏడు ముక్కలు ఆవు మాంసం తీసుకురా’’ అని ఒక ఉగ్రవాది మరొకడితో సూచించినట్లు ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు.