బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన బాగ్ధాద్: 172 మంది మృతి, 350 మందికి గాయం.
ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. వరుసగా బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. జనసంచారం అధికంగా ఉండే రెండు వేర్వేరు ప్రాంతాల్లో బాంబుదాడులు జరిగాయి. ఈ పేలుళ్లలో 15 మంది చిన్నారులు సహా 172 మంది మృతి చెందారు. 350 మంది గాయపడ్డారు.
శనివారం రాత్రి రంజాన్ ఉపవాస దీక్ష ముగించుకొని కరాదా వాణిజ్య ప్రాంతంలో షాపింగ్‌కు వచ్చిన కొన్ని కుటుంబాలు ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద దాడికి బలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే షాబ్ అనే ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్‌ను గురిపెట్టి బాంబు పేల్చారు. అప్పటిదాకా ముస్లింల కొనుగోళ్లతో సందడిగా ఉన్న ఆ ప్రాంతం దాడి తర్వాత బాధితుల ఆర్తనాదాలతో వణికిపోయింది.
విశ్వవ్యాప్తంగా ఐఎస్ పాల్పడుతున్న మారణ హోమాల్లో ఈ దాడి భారీ నష్టం మిగిల్చిన భీకర దాడిగా నిలిచింది. మృతుల్లో ఎక్కువ మంది షాపింగ్, వినోదాల మాల్‌లో బలైన వారేనని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలన చూసి బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావహంగా కనిపించింది. ఆదివారం పొద్దుపోయాక కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూనే కనిపించారు. దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్‌ఐఎస్ ఆన్‌లైన్లో ప్రకటించింది. ఉద్దేశ పూర్వకంగానే షియా ముస్లిములను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.
