లాలీపాప్.. మార్ష్‌మాలో.. నోగట్
ఆండ్రాయిడ్ ఎన్ పేరును విడుదల చేసిన గూగుల్ నోగట్‌గా నామకరణం
కిట్‌కాట్.. లాలీపాప్.. మార్ష్‌మాలో.. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుందిగా.. అవునండీ ఇవన్నీ గూగుల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ వెర్షన్లకు పెట్టిన పేర్లు. తాజాగా.. త్వరలోనే విడుదల చేయబోయే ఆండ్రాయిడ్ ఎన్‌కు కూడా గూగుల్ నామకరణం చేసింది. విషయమేంటంటే.. ఈ సారి కూడా పేరు పెట్టేందుకు గూగుల్ ఓ తీపి పదార్థాన్నే ఎంచుకుంది. అదే నోగట్. అమెరికాలో ప్రముఖ స్వీట్ అయిన నోగట్ పేరును ఆండ్రాయిడ్ ఎన్‌కు పెట్టేసింది.
ఇప్పటివరకు విడుదల చేసిన ఆండ్రాయిడ్ వెర్షన్లను ఐస్‌క్రీం, చాక్లెట్ పేర్లను పెట్టేసింది గూగుల్. కాగా.. తర్వాతి వెర్షన్ ఎన్‌కు ఏ పేరు పెడితే బాగుంటుందనే విషయంలో ఈ సారి యూజర్ల సలహాలు కోరింది. ఇందుకోసం ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను కూడా ఏర్పాటుచేసింది. గత కొన్ని నెలలుగా యూజర్లు ఆండ్రాయిడ్ ఎన్‌కు తమకు తోచిన పేర్లను చెబుతూ వచ్చారు. ట్విట్టర్లో నేమ్‌ఆండ్రాయిడ్‌ఎన్ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీంతో న్యూడిల్స్, న్యూయార్క్ ఛీజ్‌కేక్, నట్స్ లాంటి ఎన్నో పేర్లను చెప్పారు యూజర్లు. చివరగా.. నోగట్ పేరుకు గూగుల్ ఒకే చెప్పింది. ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా ప్రకటించింది. ఈ వెర్షన్‌కు సంబంధించిన ఆండ్రాయిడ్ ఐకాన్‌ను ఆవిష్కరించింది. అలా.. ఆండ్రాయిడ్ ఎన్ కాస్తా.. ఆండ్రాయిడ్ నోగట్ అయింది.
ఆండ్రాయిడ్ వెర్షన్ల పేర్లు ఇలా ఉన్నాయి.
* కప్‌కేక్ - 1.5 వెర్షన్
* డోనట్ - 1.6
* ఎక్లేర్ - 2.0
* ఫ్రోయో - 2.2
* జింజర్ బ్రెడ్ - 2.3
* హనీకోంబ్ - 3.0
* ఐస్‌క్రీం శాండ్‌విచ్ - 4.0
* జెల్లీ బీన్ - 4.1
* కిట్‌కాట్ - 4.4
* లాలీపాప్ - 5.0-5.1
* మార్ష్‌మాలో - 6.0
