ముంబయి: ఎట్టకేలకు సల్మాన్ వ్యాఖ్యలపై మరో ఖాన్ నోరు విప్పారు. దంగల్ హీరో ఆమిర్ ఖాన్ స్పష్టంగా ఖండించారు. ఇతరుల వ్యాఖ్యలను మంచి చెడూ అంటూ తాను జడ్జి చేయలేనని షారుఖ్ ఖాన్ తప్పించుకున్న సంగతి తెలిసిందే.
సుల్తాన్ సినిమా ప్రమోషన్‌లో మీడియాతో మాట్లాడుతూ షూటింగ్‌లో కొన్ని సీన్లు చేసేటప్పుడు తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉండేదంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మరో ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ స్పందించారు. ఆమిర్ నటించిన దంగల్ చిత్రం పోస్టర్ విడుదల కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ‘ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో నేనక్కడ లేను.. మీడియా వార్తల ప్రకారం అయితే .. ఆ వ్యాఖ్యలు దురదృష్టకరం, అమర్యాదకరం’ అని అన్నారు. ఈ విషయంలో తాను సల్మాన్‌తో మాట్లాడలేదన్నారు. సల్మాన్‌కు ఏమైనా సలహా ఇస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అందుకు నేనెవరినంటూ ఆమిర్ బదులిచ్చారు.
సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై వివిధ మహిళా సంఘాలు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళనలు చేపట్టగా జాతీయ మహిళా కమిషన్ ఆయనను తమ ముందు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. సల్మాన్ మాత్రం దీనిపై ఇంతవరకు స్పందించలేదు. సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ఈ వ్యాఖ్యల పట్ల కుమారుడిని తప్పుబట్టారు. తాను క్షమాపణ చెప్పారు.
