ఫేస్‌బుక్‌ చిట్కాలు!

ఎఫ్‌బీ చూడని రోజు ఉంటుందా?అసాధ్యమేనని చెప్పొచ్చు! అంతలా నెటిజన్లను ఆకట్టుకుంది... మరి, మీకు తెలుసా?ఎఫ్‌బీలో భిన్నమైన సౌకర్యాలు దాగున్నాయి!మీరు గమనించి ఉండకపోవచ్చు... ఓ సారి చెక్‌ చేయండి!



1.ఇన్‌బాక్స్‌లో అదనం...
ఎంతసేపూ వాల్‌పై ఉన్న పోస్టింగ్‌లు... వాటిపై కామెంట్‌లు... లేదంటే షేరింగ్‌లు... మెసెంజర్‌లో ఛాటింగ్‌లు! ఇవే కాదు. ఇన్‌బాక్స్‌ మెసెంజర్‌లో మీకు పరిచయం లేని ఒక ఆప్షన్‌ ఉంటుంది చూడండి. అదే ‘మెసేజ్‌ రిక్వెస్ట్స్‌’. మీ గ్రూపులో లేని గుర్తు తెలియని వ్యక్తులు మీకు పంపే మెసేజ్‌లను భద్రంగా ప్రత్యేక విభాగంలో ఉంచుతుంది. దానిపై క్లిక్‌ చేస్తే వచ్చిన డ్రాప్‌డౌన్‌ మెనూలో అన్ని మెసేజ్‌లను చూడొచ్చు. పంపిన వ్యక్తి మీకు తెలిసిన వారైతే మెసేజ్‌లు చదవడమే కాకుండా... వారి ఛాట్‌ మెసెంజర్‌ ఆహ్వానాన్ని మన్నించొచ్చు. అంతేకాదు... ఫేస్‌బుక్‌ ఇలాంటి మెసేజ్‌ల్లో కొన్నింటిని ఫిల్టర్‌ చేసి వేరుగా ఉంచుతుంది. వాటిని See Filtered Request ఆప్షన్‌పై క్లిక్‌ చేసి చూడొచ్చు.

2.బ్లాక్‌ చేయండి...
ఎఫ్‌బీ ఓపెన్‌ చేయగానే అనేక నోటిఫికేషన్స్‌ చూసి విసుగ్గా అనిపిస్తోందా? ఉదాహరణకు గేమింగ్‌ నోటిఫికేషన్స్‌ స్నేహితుల నుంచి పదే పదే వస్తుంటాయి. అంతేనా... కొన్ని నోటిఫికేషన్స్‌ మెయిల్‌ ఇన్‌బాక్స్‌కి కూడా వచ్చేస్తుంటాయి. ఇలాంటి వాటిని బ్లాక్‌ చేయాలనుకుంటున్నారా? అయితే, ఎకౌంట్‌ సెట్టింగ్స్‌లోని ‘నోటిఫికేషన్స్‌’ విభాగంలోకి వెళ్లండి. విభాగాలుగా నోటిఫికేషన్స్‌ని మేనేజ్‌ చేయవచ్చు. ముందు ఫేస్‌బుక్‌లో వచ్చే వాటిని On Facebook మెనూలో చూడండి. ఆప్‌ల నుంచి వచ్చే వాటిని App Requests and activity మెనూలో మేనేజ్‌ చేయవచ్చు. ప్రియ మిత్రుల అప్‌డేట్స్‌ని కేవలం ఫేస్‌బుక్‌కి పరిమితం చేయాలంటే Close Friends Activity ఆప్షన్‌ని On Facebook అని పెట్టుకుంటే చాలు. ఇదే మాదిరిగా గతంలో మీరు షేర్‌ చేసిన ఆల్బమ్‌లను తేదీల వారీగా వాల్‌పై అందిస్తున్న On This Day సర్వీసుని ఆఫ్‌ చేయవచ్చు. ఈ-మెయిల్‌కి వచ్చే నోటిఫికేషన్స్‌ని మేనేజ్‌ చేయవచ్చు.

3.ప్రత్యేక సెర్చింజన్‌...
రోజూ ఎఫ్‌బీ సెర్చ్‌బాక్స్‌లో ఏవేవో వెతుకుతుంటాం. వెళ్లాలనుకునే ప్రాంతం గురించో... ఏదైనా వంటకం కోసమో... ఇలా ఏదైనా ఫేస్‌బుక్‌లో విలువైన సమాచారాన్ని పొందేందుకు ప్రత్యేక ఫ్లాట్‌ఫాం ఉంది. అదే ‘ఫేస్‌బుక్‌ గ్రాఫ్‌ సెర్చ్‌’. ఈ సర్వీసుని వాడుకునేందుకు ముందుగా మీరు ఎకౌంట్‌లో లాగిన్‌ అవ్వాలి. తర్వాత ఎఫ్‌బీ సెర్చ్‌బాక్స్‌లో Facebook Graph Search కీబోర్డ్‌ని టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కాలి. దీంతో విభాగాల వారీగా గ్రాఫ్‌ సెర్చ్‌ కనిపిస్తుంది. ఇక మీరు ఏదైనా ప్రాంతం పేరుతో సెర్చ్‌ చేస్తే... విభాగాలుగా వాటిని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. కేవలం ప్రాంతానికి సంబంధించిన ఫొటోలు మాత్రమే చూద్దాం అనుకుంటే Photos ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. వీడియోలకూ ప్రత్యేక ట్యాబ్‌ ఉంది. వెతుకుతున్న ప్రాంతానికి సంబంధించిన సరికొత్త అప్‌డేట్స్‌ కోసం Latest ట్యాబ్‌ని సెలెక్ట్‌ చేయవచ్చు. ఆ ప్రాంతంలోని వ్యక్తుల్ని People ట్యాబ్‌లో చూడొచ్చు. ఇదే మాదిరిగా వివిధ అంశాల్ని ట్యాబ్‌ల్లో వెతికి చూడొచ్చు. ఈ ఫేస్‌బుక్‌ గ్రాఫ్‌ సెర్చ్‌ని www.facebook.com/graphsearcher/ యూఆర్‌ఎల్‌ లింక్‌ ద్వారా కూడా గ్రాఫ్‌ సెర్చ్‌ని పొందొచ్చు.

4.ఆల్బమ్‌ డౌన్‌లోడ్‌...
అనేక సందర్భాల్లో ఫొటో ఆల్బమ్స్‌ని ఆప్‌లోడ్‌ చేసి షేర్‌ చేస్తుంటాం. తిరిగి ఆయా ఆల్బమ్స్‌ని ఎప్పుడైనా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే? ఓ సింపుల్‌ పద్ధతిని ఎఫ్‌బీ అందిస్తోంది. ముందుగా డౌన్‌లోడ్‌ చేయాల్సిన ఆల్బమ్‌ని సెలెక్ట్‌ చేయాలి. పక్కనే కనిపించే సెట్టింగ్స్‌ గుర్తుని క్లిక్‌ చేస్తే డ్రాప్‌డౌన్‌ మెనూ వస్తుంది. దాంట్లోని Download Album ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేస్తే చాలు. చిటికెలో మొత్తం ఆల్బమ్‌ని జిఫ్‌ ఫార్మెట్‌లో సిద్ధం చేసి నోటిఫికేషన్‌ లింక్‌ని అందిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి సిస్టంలో సేవ్‌ చేయవచ్చు. తర్వాత ఆల్బమ్‌ని ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి చూడడమే!

5.హిస్టరీ చూస్తారా?
రోజూ వాల్‌పై ఎన్నో పోస్టింగ్స్‌ చూస్తుంటాం. లైక్‌లు కొడుతుంటాం... కామెంట్‌ చేస్తాం... ఇలా ఎఫ్‌బీలో రోజూ చాలానే చేస్తుంటాం. మరి, మీకు ఎప్పుడైనా మొత్తం ఫేస్‌బుక్‌ యాక్టివిటీని చూద్దాం అనిపించిందా? అయితే, ముందుగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అవ్వండి. తర్వాత www.facebook.com/me/allactivity యూఆర్‌ఎల్‌ లింక్‌ని అడ్రస్‌బార్‌లపై టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి. మొత్తం సెర్చ్‌ హిస్టరీ అంతా క్షణాల్లో ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక మీరు స్క్రోల్‌ చేస్తూ చూడడమే! ఒకవేళ మీరు పోస్ట్‌ చేసినవి మాత్రమే కావాలనుకుంటే? అందుకో సెర్చ్‌వర్డ్‌ ఉంది. ఫేస్‌బుక్‌ హోంలోని సెర్చ్‌లో posts by me టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కండి.

6.అలర్ట్‌ పెట్టారా?
మీ ఎఫ్‌బీ ఎకౌంట్‌ని మీరు తప్ప మరెవరైనా... మరేదైనా సిస్టంపై ఓపెన్‌ చేస్తే! వెంటనే మీకు అలర్ట్‌ వచ్చేలా సెక్యూరిటీ సెట్టింగ్స్‌ని మార్చారా? లేదంటే... వెంటనే సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్చేయండి. అందుకు Login Alerts విభాగంలోని ఆప్షన్స్‌ని Get Notifications మోడ్‌లో సెట్‌ చేయాలి. మీ ఎఫ్‌బీ ఎకౌంట్‌లోకి ఇతరులు ఎవరైనా వారి సిస్టంలో లాగిన్‌ అయితే చాలు. వెంటనే మెయిల్‌కి నోటిఫికేషన్‌ వచ్చేస్తుంది.

7.ఛాట్‌ సెట్టింగ్స్‌...
ఎఫ్‌బీలో లాగిన్‌ అయ్యారంటే చాలు. మీరు ఆన్‌లైన్‌లో ఉన్న విషయం స్నేహితులకు తెలుస్తుంది. ఉంటే ముచ్చట్లు పెట్టడానికి చూస్తారు. కానీ, మీరు ఆ సమయంలో కాస్త బిజీగా ఉంటారు. లేదంటే... మీకు వారితో మాట్లాడడం ఇష్టం లేదు. ఇలాంటప్పుడు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్టుగా కొందరికి తెలియకూడదు అనుకుంటే? మీరు వారికి కనిపించకుండా ఛాట్‌ సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. అందుకు ఎఫ్‌బీలో ఛాట్‌ మెసేజర్‌ సైడ్‌బార్‌లోని సెట్టింగ్స్‌ గుర్తుపై క్లిక్‌ చేయండి. పాప్‌అప్‌ మెనూలో Advanced Settings ఆప్షన్‌ని క్లిక్‌ చేయండి. వచ్చిన విండోలోని Turn off chat for only some friends ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసి కిందే ఉన్న బాక్స్‌లో ప్రొఫైల్‌ పేర్లు ఎంటర్‌ చేస్తే చాలు. మీరు సెలెక్ట్‌ చేసిన వ్యక్తులకు ఎన్నడూ ఛాట్‌ మెసేంజర్‌లో కనిపించరు. ఎప్పుడైనా మీరు వారికి కనిపించాలనుకుంటే పేరుని జాబితా నుంచి తొలగిస్తే చాలు.

8.ఇదే రోజు...
ఫేస్‌బుక్‌ వాల్‌పై ఎక్కువగా సందడి చేస్తున్న సదుపాయం On this Day. దీంతో మీరు గతంలో ఇదే రోజు వాల్‌పై ఏమేం షేర్‌ చేశారో చూసుకుని కాసేపు జ్ఞాపకాల్లో విహరించొచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం వాల్‌పై పోస్ట్‌ అయినప్పుడు మాత్రమే కాకుండా... మరో కొత్త పద్ధతిలో యాక్సెస్‌ చేయవచ్చు తెలుసా? ఓ సింపుల్‌ యూఆర్‌ఎల్‌ ఉంది. మీరు ఎఫ్‌బీలోకి లాగిన్‌ అయ్యాక facebook.com/onthisday అని యూఆర్‌ఎల్‌ని టైప్‌ చేసి ఎంటర్‌ నొక్కితే చాలు. గతంలో మీరు ఆ రోజు మీరు షేర్‌ చేసివన్నీ జాబితాగా వచ్చేస్తాయి. కావాలంటే వాటిని తిరిగి షేర్‌ చేయవచ్చు.

9.మీ తదనంతరం...
వూహించడానికి బాగోలేదు కదూ! అయినా, ఫేస్‌బుక్‌ మాత్రం మీరు వాడుతున్న ఎకౌంట్‌కి సెక్యూరిటీ నిమిత్తం Legacy Contact సర్వీసుని అందిస్తోంది. దీంతో మీ తదనంతరం మీ ఎకౌంట్‌ని ఎవరు ఆపరేట్‌ చేయవచ్చో నిర్ణయించొచ్చు. మీరు సెట్‌ చేద్దాం అనుకుంటే సెట్టింగ్స్‌లోని ‘సెక్యూరిటీ’ విభాగంలోకి వెళ్లండి. జాబితాలో లెగసీ కాంటాక్ట్‌ కనిపిస్తుంది. క్లిక్‌ చేసి అక్కడ కనిపించే Choose a friend బాక్స్‌లో ఎకౌంట్‌ ఆపరేట్‌ చేసే అర్హుడి పేరు టైప్‌ చేసి యాడ్‌ చేయాలి. ఆహ్వానాలు మన్నించి పెట్టుకున్న ‘ఫ్రెండ్స్‌’ గ్రూపులోని వారు మాత్రమే అర్హులు. పెట్టుకున్న లెగసీ కాంటాక్ట్‌ వివరాల్ని ప్రతి ఏడాది రివ్యూ చేసి మార్చుకునేలా Legacy Contact Annual Reminder సెట్‌ చేసి పెట్టుకోవచ్చు.

10.మొత్తం డేటా...
ఎఫ్‌బీలో మీరు పోస్ట్‌ చేసిన ఫొటోలు, మెసేజ్‌లు, వీడియోలు, ఫ్రొఫైల్‌లోని సమాచారం... ఇలా మొత్తం డేటాని ఒకేసారి సిస్టంలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందుకు హోం పేజీలోని సెట్టింగ్స్‌ని క్లిక్‌ చేయండి. వచ్చిన పేజీలోని Download a copy... లింక్‌పై క్లిక్‌ చేసి మొత్తం ఫేస్‌బుక్‌ డేటాని పొందొచ్చు. డేటాని పొందేందుకు ఎఫ్‌బీ ఎకౌంట్‌ పాస్‌వర్డ్‌ని ఎంటర్‌ చేయాలి. కొంత సమయం తర్వాత మెయిల్‌కి వచ్చిన డౌన్‌లోడ్‌ లింక్‌పై క్లిక్‌ చేసి డేటాని పొందొచ్చు.

All the Best