అన్నయ్యా... నువ్వు లేకుండా ఈ లోకంలో నేనుండలేను... అన్న చితిపైకి దూకేసి అగ్నికి ఆహుతైన చెల్లెలు

fire


సతీసహగమనం అనే ఎప్పుడో పాతకాలంలో ఉండేది. భర్త చనిపోతే భార్యను అదే చితిపై కూర్చోబెట్టి తగులపెట్టేవారు. ఈ ఆచారాన్ని సంఘ సంస్కర్తలు పారదోలేందుకు ఎంతో శ్రమించారు. అదలావుంటే దీనికి భిన్నంగా తన సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే అతడికి చితి పేర్చి శ్మశానంలో అంత్యక్రియలు చేస్తున్న సమయంలో ఓ సోదరి మండుతున్న చితిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌‌ పట్టణం సతీరాంపూర్‌కు చెందిన 32 ఏళ్ల వేల రామ్ మనత్ గురువారం రాత్రి దుంగార్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడు రాత్రి చనిపోవడంతో శుక్రవారం నాడు ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. 
 
శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు జరిపి అంతా ఇంటికి బయలుదేరారు. చితిపై మనత్ శవం సగం కాలుతోంది. కాలుతున్న ఆ శవాన్ని అలా చూస్తూ అతడి 28 ఏళ్ల సోదరి దుర్గ ఆ చితిపైకి దూకేసింది. ఆమె అలా దూకడాన్ని ఓ బాలుడు చూసి పోలీసులకు చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఆమె దేహం సగానికి పైగా కాలిపోయింది. ఆమె మృతదేహాన్ని చితి నుంచి బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. కాగా ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు.