వెయిటర్ కాదు.. గవర్నర్ భార్య



వాషింగ్టన్: అమెరికాలోని మెయిన్ రాష్ట్ర గవర్నర్ పాల్ లెపాజ్ భార్య యాన్ లెపాజ్ వెయిట్రెస్‌ అవతారం ఎత్తారు. మెక్ సీగుల్ రెస్టారెంట్‌లో ఆమె వెయిట్రెస్‌గా పార్‌టైం జాబ్ చేస్తున్నారు. గవర్నర్ భార్య అయిన ఆమెకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే తన భర్త పాల్ లెపాజ్‌కు వచ్చే జీతం అతి తక్కువగా 70 వేల డాలర్లే ఉండటం వల్ల తాము ఓ కొత్త టయోటా కారు కొనలేకపోతున్నామని తెలిపింది. అందుకే తన జీతం ద్వారా కారు కొనాలనుకున్న కోరిక తీర్చుకోవాలని నిర్ణయించుకుని వెయిట్రెస్‌ ఉద్యోగంలో చేరామన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల గవర్నర్ల కన్నా పాల్ లెపాజ్ జీతం మాత్రమే అతి తక్కువగా ఉంది. మెయిన్ రాష్ట్రానికి తొలి మహిళ అయినా వెయిట్రెస్‌గా ఉద్యోగం చేసేందుకు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రకారం ఏ ఉద్యోగం అయినా గౌరవప్రదమైందేనని ఆమె చెబుతున్నారు. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదన్నారు. భర్త గవర్నర్ అయినా విలాసాలకు పోకుండా నిజాయితీగా సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారీమె. రెస్టారెంట్‌కు వస్తున్నవారందరూ ఆమెను ఆరాధనగా చూస్తున్నారు. ఆమె స్ఫూర్తిని కొనియాడుతున్నారు.