ఐటీ కోర్సులను ఎంపిక చేసుకుని స్టడీ పూర్తి చేసిన విద్యార్థులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీటెక్‌లో సాఫ్ట్‌వేర్ కోర్స్ పూర్తి చేసి కోటి కలలతో నగరబాట పడుతున్న యువత ఉద్యోగాల వేటలో అలిసిపోయి నిస్సహాయ స్థితిలో కూరుకుపోతోంది. ఉద్యోగాలు దొరక్క బీటెక్ బాబులు నానా తంటాలు పడుతుంటే ఐటీ సంస్థలు వీరికి మరో షాకిచ్చాయి. కొత్త ఉద్యోగాల మాట అటుంచితే ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆరున్నర లక్షల మందిని విధుల నుంచి తొలగించేందుకు కసరత్తు చేస్తోంది.
యూఎస్‌కు చెందిన హెచ్‌ఎఫ్‌ఎస్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వచ్చే ఐదేళ్లలో ఇండియాలో ఐటీ, బీపీవో రంగాల్లో తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల ఏరివేతకు రంగం సిద్ధమైంది. దీని ప్రకారం దాదాపు ఐదుగురిలో ఒకరు ఉద్యోగాన్ని కోల్పోనున్నారు. మానవ సామర్థ్యాన్ని తగ్గించి యాంత్రీకరణ వైపు అడుగులు వేసేందుకు ఐటీ ఉవ్విళ్లూరుతోంది. దీని కారణంగానే ఫ్రెషర్స్‌గా వెళ్లిన ఉద్యోగులకు జాబ్ సెక్యురిటీపై నమ్మకం ఇవ్వలేని స్థితిలో ఐటీ రంగం ఉంది. ఈ ప్రభావం ఒక్క ఇండియాపైనే కాదు అమెరికాలో దీని ప్రభావం వల్ల ఏడున్నర లక్షల మంది, యూకెలో రెండు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.
