ట్రినిడాడ్: పొట్టి ఫార్మాట్ లో తనను మించిన మొనగాడు లేడని 'సిక్సర' పిడుగు క్రిస్ గేల్ మరోసారి నిరూపించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో తనదైన శైలిలో ఆడి 18వ టీ20 శతకం బాదాడు. ఒంటిచేత్తో తన జట్టు జమైకా తల్లవాహ్ కు విజయాన్ని అందించాడు. ట్రిన్ బాగొ నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో జమైకా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ట్రిన్ బాగొ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే చేరుకుంది. 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 54 బంతుల్లో 6 ఫోర్లు, 11 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. అజేయంగా నిలిచి జట్టును విజయపథంలో నడిపించాడు. సంగక్కర 20, రసెల్స్ 24, పావెల్ 12, వాల్టన్ 13 పరుగులు చేశారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రిన్ బాగొ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. హషిమ్ ఆమ్లా(74), మున్రో(55) అర్ధ సెంచరీలు చేశారు. మెక్ కల్లమ్ 35, బ్రావొ 10 పరుగులు సాధించారు. సెంచరీతో చితకొట్టిన గేల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు.
