‘ఓపెన్ సెల్యులార్’తో ప్రపంచం ఒక్కటవుతుంది : జుకర్‌బర్గ్




కాలిఫోర్నియా : ఫేస్‌బుక్ అంటేనే సంచలనాలు, సృజనాత్మకత. ఎప్పటికప్పుడు అనూహ్యమైన సదుపాయాలు కల్పిస్తూ జనాన్ని ఆకట్టుకోవడంలో దానికి అదే సాటి. ఇంటర్నెట్ ప్రభంజనం సృష్టిస్తున్న ఈరోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని ఫేస్‌బుక్ నిర్ణయించింది.

మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం... ప్రపంచాన్ని అనుసంధానించేందుకు ఓపెన్ సెల్యులార్‌‌‌ అనే పథకాన్ని ఫేస్‌బుక్ ప్రారంభించింది. సుదూర ప్రాంతాలకు వైర్‌లెస్ కనెక్టివిటీని ఓపెన్ సోర్స్‌లో అందిస్తామని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. 400 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్‌ సదుపాయాన్ని పొందలేకపోతున్నారని, ప్రస్తుతం ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవలు అందని ప్రాంతాలకు ఎలా వెళ్ళాలో గుర్తించడమే ప్రధాన సవాలు అని తెలిపారు. ప్రపంచాన్ని ఒక్కటి చేసేందుకు తాము ఓపెన్ సెల్యులార్‌ను రూపొందించామని, దీనిని అందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. టెలికాం ఆపరేటర్లు, పరిశోధకులు, పారశ్రామికవేత్తలు సహా ఎవరైనా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. సుదూర ప్రాంతాల్లో వైర్‌లెస్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని, నిర్వహించుకోవచ్చునన్నారు. చెప్పుల పెట్టె పరిమాణంలో ఇది ఉంటుందన్నారు. 10 కి.మీ. పరిధిలో 1,500 మంది దీనిని ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. ప్రపంచాన్ని మరింత దగ్గరకు తేవడానికి అత్యుత్తమ కనెక్టివిటీని అందజేయడంలో ఇది మరో ముందడుగు అని వివరించారు.