రిస్క్ లేకుండా క్రెడిట్ కార్డ్ వినియోగం..
ప్రస్తుతం నడుస్తున్నది ప్లాస్టిక్ మనీ ప్రపంచం. ఎవరి జేబులో చూసినా పలు ప్లాస్టిక్ కార్డ్‌లు తప్పకుండా కనిపిస్తాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లు విరివిగా వాడుతుంటారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే.. పలు ఉపయోగాలు ఉన్నప్పటికీ పూర్తిగా వినియోగించడానికి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అందుకు కారణం బాకీ పడతామనే భయం, అప్పుల ఊబిలో ఇరుక్కుంటామనే జంజాటం. అయితే జాగ్రత్తతో పాటు కొద్దిపాటి అవగాహన ఉంటే పెద్ద కొనుగోళ్లకు కూడా రిస్క్ లేకుండా చక్కగా క్రెడిట్ కార్డును వాడుకోవచ్చు.
క్రెడిట్ హిస్టరీ
క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు మొదలుపెట్టిన తర్వాత నుంచి మన లావాదేవీల రిపోర్టు రికార్డ్ అవుతుంటుంది. సమయానికి సరిగ్గా చెల్లింపులు చేస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. సరైన సమయంలోనే కట్టాల్సిన పద్దులు చెల్లించేస్తే మంచి స్కోర్‌తో గుడ్ పర్సన్‌గా రేటింగ్ వస్తుంది. దీంతో పెద్ద లోన్లు ఇచ్చే విషయంలో బ్యాంకులు సంకోచించకుండా ప్రాధాన్యతనిస్తాయి. నిజానికి క్రెడిట్ కార్డుపై ఉన్న కాష్ లిమిట్‌లో 30-40 శాతం మాత్రమే కొనుగోళ్లు చేస్తే మంచింది. ఎందుకంటే అంతకు మించితే దాని వల్ల క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.
ఈఎంఐ
పెద్ద కొనుగోళ్లు చేసినప్పుడు వాటిని EMIకి మార్చుకుంటాం. కొనుగోలు సమయంలో వ్యాపారి ఈఎంఐ ఆప్షన్ చెప్తాడు. సదరు బ్యాంక్‌తో వాళ్లకు ఉన్న ఒప్పందం ప్రకారం వాళ్ల సమర్ధత ఆధారంగా ఈఎంఐకి మారుస్తారు. అయితే దీని ద్వారా అసలు కంటే వడ్డీ కొంచెం ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డులు కొన్ని ప్రత్యేక ఆఫర్ల సందర్భాల్లో వడ్డీలు వసూలు చేయవు. అలాంటి ఆఫర్లను తెలుసుకోవడం మంచిది. ఇందుకోసం బ్యాంక్ లేదా కోనుగోలు చేసే వ్యాపారిని అడిగి కనుక్కోవాలి.
