వాషింగ్టన్: ఆపిల్ ఐఫోన్ అధినేతగా, టెక్నాలజీ గురూగా ప్రపంచ గౌరవాభిమానాలు పొందిన వ్యక్తి స్టీవ్ జాబ్స్. అయితే అమెరికాకు చెందిన థామస్ రాస్ అనే వ్యక్తి మాత్రం స్టీవ్ జాబ్స్ ఒట్టి మోసగాడని అంటున్నాడు. తన డిజైన్‌ను కాపీ కొట్టి ఐఫోన్‌ను రూపొందించాడని రాస్ ఆరోపిస్తున్నాడు. అందువల్ల తనకు ఆపిల్ కంపెనీ 21 బిలియన్ డాలర్లు (లక్షా 41వేల కోట్ల రూపాయలు) నష్టపరిహారంగా చెల్లించాలని ఫ్లోరిడా కోర్టులో కేస వేశాడు.
1992లోనే తాను ఐఫోన్ మోడల్‌లోనే ఓ ఫోన్‌ను డిజైన్ చేశానని, అప్పుడే పేటెంట్ కోసం అప్లయ్ చేశానని తెలిపాడు. అయితే అవసరమైన ఫీజు తాను కట్టనందువల్ల యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ ఆఫీస్ దానిని 1995లో తిరస్కరించిందని తెలిపాడు. ఆ డిజైన్ అధారంగానే స్టీవ్‌జాబ్స్ 2007లో తొలి ఐఫోన్‌ను విడుదల చేసి అది తన సొంత డిజైన్‌గా క్రెడిట్ కొట్టేశాడని ఆరోపించాడు. అందుకే తనకు రావాల్సిన నష్టపరిహాంతోపాటు రాయల్టీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఐఫోన్ డిజైన్ తమదేనంటూ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలామంది తమ డిజైన్‌నే స్టీవ్‌జాబ్స్ కాపీ కొట్టాడని వివాదాలు సృష్టించారు.
