మెస్సీ..నిర్ణయం మార్చుకో!


Messi

అర్జెంటీనా అధ్యక్షుడు, మారడోనా విజ్ఞప్తి
బ్యూనోస్‌ ఎయిర్స్‌: ప్రపంచ ఫుట్‌బాల్‌లో తన అద్బుత విన్యాసాలతో వేలాదిమందిని ఉర్రూతలూగించిన అర్జెంటీనా మేటి ఆటగాడు కోపా అమెరికా పరాజయంతో రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోవడంపై ఆ దేశ అధ్యక్షుడు, సాకర్‌ మాజీ లెజెండ్‌ ఆటగాడు డిగో మారడోనా తీవ్రంగా స్పందించి, నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో అద్వితీయ విజయాలు అందించిన మెస్సీ, ఓ ఫెనాల్టి కిక్‌ను గోల్‌గా మలచడంలో విఫలం కావమే కాకుండా, 23 ఏళ్లుగా ఓ మేజర్‌ టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న అర్జెంటీనా సాకర్‌ అభిమానులను సైతం ఆనందపర్చలేకపోయాడు. గత సంవత్సరం ఇదే చిలీతో అర్జెంటీనా ఓడినప్పటికీ, అప్పుడు జట్టులో మెస్సీ లేడు. అందువల్ల ఈసారి మెస్సీ జట్టులో ఉండడంతో తప్పకుండా అర్జెంటీనా ట్రోఫీ గెలుస్తుందని భావించారు. ఈ క్రమంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా, చిలీపై ఒక్క గోల్‌ కూడా చేయలేకపోవడం విశేషం. అంతేకాదు. ఫెనాల్టి షూటౌట్‌లోనూ చేతులెత్తేసింది.
మరోవైపు చిలీలో కోపా అమెరికా ఫైనల్లో ఓటమిపాలైన రోజే స్వదేశానికి చేరుకున్న మెస్సీ తన రిటైర్మెంట్‌పై స్పందించేందుకు నిరాకరించాడు. కోపా అమెరికా ఫైనల్లో అర్జెంటీనా జట్టు చిలీ చేతిలో ఓటమిపాలు కావడానికి మెస్సీ కూడా కారకుడు. టోర్నీ ముగిసిన తర్వాత యుఎస్‌ నుంచి రానున్న తమ జట్టు కోసం వైట్‌, స్కైబ్లూతో, మెస్సీ నంబర్‌ 10తో కూడిన అర్జెంటీనా జెర్సీని ధరించిన చాలా మంది అభిమానులు జట్టు రాకకోసం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎదురు చూశారు. విమానాశ్రయం నుంచి అర్జెంటీనా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఏఎఫ్‌ఏ) వరకు ఆటగాళ్లతో వెళ్లిన బస్సును కొంత మంది అభిమానులు వెంబడించారు. జెండాలను ఊపుతూ ‘మెస్సీ వెళ్లిపోవద్దు’ అని నినాదాలు చేశారు. ఒక అభిమాని అయితే ‘మెస్సీ.. నిన్న మా అమ్మకంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాను’ అని ఓ బ్యానర్‌ ప్రదర్శించాడు. అయితే ఆ బస్సులో మెస్సీ లేదు. మిగతా ఆటగాళ్లతో పాటు మెస్సీ వస్తున్నాడని ఏఎఫ్‌ఏ ప్రతినిధి అర్నెస్టో చెర్‌క్విస్‌ బియాలో మీడియాకు తెలిపారు.
ఇదిలావుంటే రాజీనామాపై పునరాలోచించాలని అర్జెంటీనా అధ్యక్షుడు, అభిమానులు, ఆ దేశ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లతో పాటు అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా కూడా మెస్సీని అభ్యర్థించాడు. ‘వెళ్లిపోవద్దు లియో (డోన్ట్‌ లీవ్‌ లియో)’ అని అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మక్రి ట్వీట్‌ చేశారు. కొంత మంది అయితే అనాలోచితంగా మెస్సీ రిటైర్మెంట్‌ ప్రకటించాడన్నారు. కొంత మంది అభిమానులు ఏఎఫ్‌ఏ కార్యాలయానికి చేరుకున్నారు.
మా జట్టుకే అతను గర్వకారణమని నేను భావిస్తున్నాను. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు మెస్సీ మళ్లి ఫుట్‌బాల్‌ ఆడతాడని.. మరికొన్న సంవత్సరాలు అతని ఆటను మనం ఆస్వాదిస్తామని నాకు నమ్మకముంది’
-అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మక్రి
అతను కొనసాగాలి. ఎందుకంటే సుదీర్ఘ కాలం కొనసా గే సత్తా అతనిలో ఇంకా ఉంది. ఎందుకంటే రష్యాలో అర్జెంటీనాను ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టగలడు.
– అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా
మెస్సీ ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడు. పునరాలోచించాలి. ఏది ఏమైనా ఒక మంచి అవకాశం చేజారింది.
-అర్జెంటీనా గోల్‌ కీపర్‌ సెర్గియో రొమెరో
‘చాలా బాధగా ఉంది. రెండు విషయాల్లో నాకు బాధ కలిగింది. కోపా అమెరికా కప్‌ను మెస్సీ గెలవాల్సింది. ఎందుకంటే అతను అంత గొప్ప ఆటగాడు. అంత మాత్రాన ఫుట్‌బాల్‌ను వదిలేస్తానంటే నేను ఒప్పుకోను’ 
– 29 ఏళ్ల అభిమాని జువాన్‌ పాబ్లో పినాస్కో
అతను గొప్ప ఆటగాడు. అర్జెంటీనా లో మాత్రమే కాదు ప్రపంచంలోనే గొప్ప ఆటగాడు. కానీ అదృష్టం కలిసిరాలేదు. అయినా ఫరవాలేదు. అతను ముందుకు సాగాలి. జట్టు అతనికి సహకరించడం లేదు.
-మరో అభిమాని గైడో సాంచి
అర్జెంటీనా తదుపరి మ్యాచ్‌ వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో సెప్టెంబర్‌లో ఉరుగ్వేతో ఆడుతుంది. 2018లో రష్యాలో జరగనున్న వరల్డ్‌ కప్‌లో అర్జెంటీనా పేరు హాట్‌ ఫేవరెట్‌గా వినిపిస్తోంది. అర్జెంటీనా జట్టు 1978, 1986లలో ప్రపంచ విజేతగా నిలిచింది. కానీ 1993లో కోపా అమెరికా టైటిల్‌ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క మేజర్‌ టైటిల్‌ కూడా గెలవలేదు.