వంటింటి చిట్కాలు

వంటింటి చిట్కాలు


1. ఇన్ స్టంట్ కాఫీపొడి గడ్డకట్టకుండా ఉండాలంటే దానిని ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచి డీప్ ఫ్రిజ్ లో ఉంచితే ఎంత కాలమైనా గడ్డకట్టకుండా ఉంటుంది.

2. వంటగదిలో చీమలు స్వైరవిహారం చేస్తున్నాయా? ఒక దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట ఉంచండి.

3. కూరగాయలు వడలిపోయాయా? నిమ్మరసం కలిపిన నీటిలో ఓ పది నిముషాలు ఉంచండి. తాజాగా అవుతాయి.

4. కూరల్లో మసాలా ఎక్కువైందా? రెండు మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గి మంచి రుచిగా వుంటుంది.

5. చెక్కతో చేసిన చెంచాలు, గరిటెలు వాసన వేస్తుంటే వాటిని వెనిగర్ కలిపిన నీటిలో ఉంచండి. కొద్ది సేపైన తర్వాత వాడుకోండి. వాసన రావు.

6. వంట చేసేటప్పుడు చేతులు మరకలు అవుతున్నాయా? ఆలుగడ్డ (బంగాళా దుంప) ముక్కలతో రుద్ది కడుక్కోండి.

7. పెనం, మూకుడు వంటి వాటికి పదార్థాల మరకలు వదలకుంటే గిన్నెలు తోముకునే లిక్విడ్ కు కొంచెం వంటసోడా, కొన్ని నీళ్ళు కలిపి రుద్దండి.

8. అన్నం వంటేప్పుడు ముద్దగా అవుతున్నదా? ఉడికేప్పుడు చెంచా వంట నూనె వేస్తే పొడిపొడిగా వుంటుంది.

9. వడలు, గారెలు చేసేటప్పుడు నూనె చిల్లుతుందా? నూనెలో రెండు చెంచాల నెయ్యి కలపండి.

10. పెనానికి జిడ్డు బాగా పేరుకు పోయి ఎంతకూ వదలడం లేదా? పెనాన్ని వేడి నీళ్ళలో రెండు మూడు గంటలుంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దండి.

11. మీరు పెట్టిన దోస ఆవకాయ బాగా ఘాటుగా ఉందా? అందులో కొంచెం నిమ్మ రసం పిండండి.

12. దోశలు మెత్తగా రావడం లేదా? బియ్యం రవ్వ/బొంబాయి రవ్వను కప్పు తీసుకుని జావకాచి చల్లార్చి దోశ పిండిలో కలపండి.

13. అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిలువ వుండటం లేదా? వాటిని కాగితం కవర్లో వేసి లేదా కాగితంతో పొట్లం కట్టి ఫ్రిజ్లో వుంచండి.

14. నిలువ పచ్చళ్ళు మీకు పడటం లేదా? సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్, క్యారెట్ ముక్కల్ని ఉప్పు కలిపిన నిమ్మరసంలో నానబెట్టి, కావాలనుకున్నప్పుడు పెరుగన్నంతోబాటు తినండి.

15. పంచదార డబ్బాకు చీమలు పడుతున్నాయా? అందులో కొన్ని లవంగాలని వేయండి.

16. చేప ముక్కల్ని నిల్వచేయాలా? వాటికి కొద్దిగా ఉప్పు కలిపి డీప్ ఫ్రీజర్ లో ఉంచండి. ముక్కలు అంటుకోవు. ఐస్ పేరుకోదు.

17. వంటల్లో వేయటానికి మొక్కజొన్న పిండి అందుబాటులో లేకుంటే మైదా పిండి వేసుకోవచ్చు.

18. అల్యూమినియం గిన్నెలో వండేప్పుడు గిన్నె మాడుతున్నదా? ఉడికేప్పుడు చెంచా వెనిగర్ వేయండి.

19. గ్రేవీ, సూపులు చిక్కగా రావడం లేదా? అవి తయారు చేసేప్పుడు తగినంత మొక్కజొన్న పిండి కలపండి.

20. పాస్తా చేసేప్పుడు ఉప్పును ముందుగా వేయొద్దు. ఉడికిన తర్వాతనే వెయ్యాలి.

21. స్వీట్స్ చేసేప్పుడు చక్కెరకు బదులుగా దానిని పొడిచేసి వేస్తే అవి ఇంకా రుచిగా వుంటాయి.

22. లంచ్ బాక్స్ లు వాసన వేస్తున్నాయా? రెండు మూడు రోజులకొకసారి నిమ్మచెక్కతో రుద్ది కడగండి.

23. వాల్ నట్స్ ను రాత్రంతా ఉప్పునీటిలో నానబెట్టి ఉదయాన పెంకును సులువుగా తీయొచ్చు.

24. కూరగాయలు తరిగేప్పుడు చేయి కాలినా/తెగినా అలోవెరా జెల్ ను రాయండి.

25. కేక్ గుడ్డు వాసన వస్తూంటే… తయారు చేసేప్పుడు రెండు స్పూన్ల తేనె కలపండి.

26. చపాతీ నిల్వ చేసుకోవాలంటే వాటిని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి మధ్యలో ఆలుగడ్డ (బంగాళా దుంప) చెక్కు తీసి పెట్టండి. రెండు రోజులకోమారి ఆలుగడ్డను మారుస్తూ వుండండి.

27. ఫ్రూట్ సలాడ్ చాలా రోజుల వరకు నిలువ వుంచుకోవాలంటే దానిమీద అర కప్పు నిమ్మరసం చల్లండి. వాసన కూడా సూపర్ గా వుంటుంది.

28. ఆలుగడ్డ (బంగాళాదుంప) ని వేయించే ముందు ముక్కలను మజ్జిగలో పది నిముషాలు ఉంచండి. చక్కగా వేగుతాయి. రుచిగా ఉంటాయి.

29. కాకరకాయలు ఫ్రిజ్ లో వుంచినా పండి పోతున్నాయా? వాటిని వీలైనంత చిన్నవిగా విరిచి నిలువ చేయండి. ఎక్కువ రోజులు నిలువ వుంటాయి.

30. డ్రై ఫ్రూట్స్ తో స్వీట్లు చేయాలనుకొన్నప్పుడు కాసేపు వాటిని ఫ్రిజ్ లో ఉంచి తీసి, కొద్దిగా వేడి చేసిన కత్తితో కోయండి. సులువుగా కోయొచ్చు.

31. ఫ్రిజ్ లో పెట్టిన నిమ్మకాయను ఓ పది నిమిషాలు వేడి నీటిలో ఉంచి కోయండి. రసం బాగా వస్తుంది.

32. నిలువ పచ్చళ్ళకు ఫంగస్ సోకకుండా వుండాలంటే నిలువ చేసేముందు డబ్బాలో కంది గింజంత ఇంగువని కాల్చి అందులో వేసి తీసివేయండి.

33. వెల్లుల్లిని ఎక్కువ రోజులు నిలువ చేసుకోవాలంటే వాటిని పొట్టుతీసి తడి లేకుండా కాసేపు ఎండబెట్టి ఆలివ్ నూనెలో వేసుకుని ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.

34. కొన్ని రకాల కేక్ లు, బిస్కట్ల తయారీలో వాడే హేజల్ నట్స్ దొరకనప్పుడు కప్పు బాదం పలుకులు వేసుకోవచ్చు. రుచిలో తేడా వుండదు.

35. కూరగాయలు ఉడికించాక రంగు కోల్పోకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు పసుపు, చెంచా ఆలివ్ నూనె జోడిస్తే సరిపోతుంది.

36. మూకుడు అడుగున పదార్థాలు అంటుకుపోయి ఉంటే ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో రుద్దితే త్వరగా వదిలిపోతాయి.

37. కూరగాయలు కడిగే నీళ్ళలో నాలుగైదు చుక్కల వెనిగర్, చిటికెడు ఉప్పు కలిపితే వాటి మీద పేరుకున్న సూక్ష్మక్రిములు నశిస్తాయి.

38. బియ్యాన్ని మిక్సీ పట్టేటప్పుడు అందులో చెంచా పంచదార కలిపితే బియ్యం పిండి తెల్లగా వస్తుంది.

39. చిన్న ఇంగువ ముక్కను శుభ్రమైన వస్త్రంలో మూట కట్టి సగ్గు బియ్యం వడియాలు నిల్వ ఉంచిన డబ్బాలో ఉంచాలి. ఇలా చేస్తే, వేయించినప్పుడు మంచి వాసన వస్తాయి.

40. పకోడీలు కరకరలాడాలంటే శనగ పిండిలో చెంచా వేడి నూనె, చిటికెడు వంటసోడా కలపండి.

41. గసగసాలను వేడినీళ్ళలో నానబెట్టి రుబ్బితే మిశ్రమం మెత్తగా వస్తుంది.

42. సీసా లోపలి భాగంలో నూనె రాసి జామ్ ను ఉంచి నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

43. పాస్తాను ఉడికించే నీళ్ళలో చెంచా ఆలివ్ నూనె, చిటికెడు ఉప్పు వేస్తే ఒకదానికొకటి అతుక్కోవు.

44. కూరల వేపుళ్ళలో నూనె ఎక్కువైతే బ్రెడ్ ముక్క లేదా ఉడికించిన ఆలుగడ్డ (బంగాళా దుంప) ముక్క వేసి కాసేపైనాక తీస్తే సరిపోతుంది.

45. గ్రేవీ, సూప్ చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువైతే మొక్కజొన్న పిండి చేర్చండి.

46. దోశలు మెత్తగా రావాలంటే దానిలో కొంచెం ఉడికించిన అన్నం కానీ, మరమరాలు కానీ మిక్సీలో వేసేటప్పుడు వేస్తే సరిపోతుంది.

47. బఠానీలు ఉడికించే ముందు అర చెంచా పంచదార లేదా నాలుగు చుక్కల వెనిగర్ చేర్చితే అవి రంగు మారకుండా ఉంటాయి.

48. మసాలా కూరల్లో పెరుగు లేదా మజ్జిగ వేయాలంటే పెరుగులో కొద్దిగా వరిపిండి కలిపి అప్పుడు కూరలో వేయండి.

49. టమాటా సూప్ లో కొద్దిగా బీట్ రూట్ రసం కలిపితే మంచి రంగు వస్తుంది.

50. పూర్ణం ఉండలు, పిండిలో ముంచి నూనెలో వేసే ముందు పది నిముషాలు డీప్ ఫ్రిజ్ లో ఉంచితే అవి చిట్లవు.

51. పచ్చిమిర్చి తొడిమలు తొలగించి గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి. వాటిపై కొద్దిగా పసుపు చల్లి మూతపెట్టేయాలి. ఇలా చేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా వుంటాయి.

52. కూరగాయలను అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

53. ఇడ్లీ పిండిలో నీళ్ళు ఎక్కువై పల్చగా అయితే కాస్త బొంబాయి రవ్వ వేయండి. పిండి గట్టిగా అవడమే కాకుండా రుచిగా కూడా వుంటాయి.

54. గులాబ్ జామ్ మెత్తగా రావాలంటే పిండిలో కాసిని పాలు, కొద్దిగా నెయ్యి చేర్చి కలిపితే సరిపోతుంది.

55. పెసరట్లు కరకరలాడాలంటే పెసర్లలో గుప్పెడు బియ్యం వేసి నానబెట్టి రుబ్బాలి.

56. కడిగిన బియ్యంలో బిర్యానీ ఆకు వేయండి. అన్నం ఉడికాక ఆకు తీసేస్తే అన్నం మంచి వాసన వస్తుంది.

57. పకోడీ పిండి కలిపేటప్పుడు శనగపిండితో పాటు చెంచా మొక్కజొన్న పిండి కూడా కలిపితే కరకరలాడతాయి.

58. బంగాళాదుంపలని వేయించడానికి ముందు మజ్జిగలో నానబెడితే రుచిగా ఉంటాయి.

59. నూనెలో కొద్దిగా దొడ్డుప్పు వేసి తర్వాత అప్పడాలు వేయిస్తే ఎక్కువ నూనె పీల్చుకోవు.

60. బియ్యాన్ని వేడినీటితో రెండుసార్లు కడిగితే… గంజి శాతం తగ్గుతుంది. అన్నం పొడిపొడిగా వస్తుంది.

61. పిండిలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే దోశలు పల్చగా వస్తాయి. కరకరలాడతాయి.

62. గాలి చొరని డబ్బాలో కరివేపాకును ఉంచి అందులో కొన్ని మెంతులు వేస్తే ఆకులు ఎక్కువ రోజులు తాజాగా వుంటాయి.

63. ఉడికించిన బంగాళాదుంప ముక్కల్ని నీళ్ళ సీసాలో వేసి అటూ ఇటూ తిప్పి కడిగితే సీసా లోపల పేరుకొన్న మట్టి, దుమ్ము కణాలు బయటకు వచ్చేస్తాయి.

64. వంటసోడా, ఉప్పు సమపాళ్ళలో తీసుకొని నీళ్ళు కలపాలి. ఈ మిశ్రమాన్ని సిరా మరకల మీద రాసి పావుగంట అయ్యాక ఉతికితే దుస్తులు శుభ్రపడతాయి.

65. క్యాలీఫ్లవర్ ను ఉడికించే నీళ్ళలో కాసిని పాలు చేర్చితే రంగు మారకుండా ఉంటుంది.

66. వెల్లుల్లిని కొద్దిసేపు ఓవెన్ లో ఉంచి తీస్తే పొట్టు తీయడం సులువు అవుతుంది.

67. క్యాబేజీ వాసన నచ్చకపోతే దాన్ని ఉడికించేటప్పుడు నీళ్ళలో నాలుగు చుక్కల వెనిగర్, రెండు లవంగాలు వేస్తే సరిపోతుంది.

68. క్యాబేజీ కూర చేసేప్పుడు పైన మూత పెట్టకుండా వుంటే వాసన రాదు.

69. బెండకాయ కూర జిగురుగా వుండకూడదనుకుంటే అందులో కొన్ని టమాటాలను వేసి వండండి.

70. ఆవపిండి పొడిపొడిగా ఉండాలంటే మిక్సీ పట్టేప్పుడు ఆవాల్లో కొద్దిగా ఉప్పు వేయండి.

71. పాలపై మీగడ మందంగా పేరుకోవాలంటే గిన్నెకు మస్లిన్ వస్త్రం చుట్టి ఫ్రిజ్ లో ఉంచండి.

72. సగ్గుబియ్యం నానబెట్టి రెండు గంటల తర్వాత రుబ్బి మినప్పిండిలో కలిపితే దోశలు పల్చగా వస్తాయి.

73. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ముందుగా మూకుడులో ఉప్పు, చిటికెడు పసుపు కలిపితే ముక్కలు నూనెను పీల్చుకోవు.

74. మిగిలిపోయిన కేకు ముక్కలను ఉంచిన డబ్బాలో నాలుగు ఆపిల్ ముక్కలు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి.

75. మూకుడు అడుగు మాడినప్పుడు అందులో నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టండి. చల్లారాక రుద్ది కడిగితే అది శుభ్రపడుతుంది.

76. ఆమ్లెట్ గుల్లగా పొంగినట్టుగా రావాలంటే కోడిగుడ్డు సొనని గిలక్కొట్టే ముందే అందులో చిటికెడు ఉప్పు వెయ్యండి.

77. చికెన్ వేయించేటప్పుడు చక్కని రంగులో రావాలంటే మొక్కజొన్న పిండికి బదులు పాలపొడిని తీసుకొని దాన్లో అద్ది వేయించాలి.

78. రెండు చెంచాల వెనిగర్ లో కాసిని వేడి నీళ్ళు, చెంచా ఉప్పు కలిపి వంటగది బల్లను శుభ్రపరచాలి. ఇలా చేస్తే వంట చేసేటప్పుడు పడిన నూనె, ఇతర ఆహార పదార్థాల వల్ల ఏర్పడిన మొండి మరకలు తొలగిపోతాయి.

79. ఆలుగడ్డ (బంగాళా దుంప), బెండకాయలతో వేపుళ్ళు చేస్తున్నప్పుడు అవి అడుగు అంటకుండా ఉండాలంటే, ముందు మూకుడును బాగా వేడిచేసి ఆ తరువాతే నూనె వేయాలి.

80. పచ్చిగా ఉన్న కాయలు త్వరగా పండాలంటే… కాగితంలో చుట్టి బియ్యం డబ్బాలో లేదా వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచితే చాలు.

81. పిండిలో చెంచా వంట సోడా కలిపితే జిలేబీ చుట్లు ఉబ్బినట్టు వస్తాయి. విరగవు కూడా.

82. పప్పులు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే నిలువ ఉంచే డబ్బాల అడుగున నాలుగు వెల్లుల్లి రేకలు వేస్తే సరి.

83. గారెలు కరకరలాడుతూ రావాలంటే వాటిని చేతితో అద్దేటప్పుడు పుల్లని మజ్జిగతో అద్దితే సరి.

84. పచ్చి బఠాణీ ఏడాది పాటూ నిల్వ ఉండాలంటే వస్త్రంలో మూటకట్టి ముందుగా వేడినీళ్ళలో మూడు నిముషాలపాటు, మరో మూడు నిమిషాలపాటు చల్లటి నీటిలో ముంచాలి. తరవాత ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇప్పుడు వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టండి.

85. తేనెలో నాలుగు మిరియం గింజలు వేసి భద్రపరిస్తే చీమలు దరిచేరవు.

86. అగరొత్తి వెలిగించినప్పుడు రాలే బూడిదతో ఇత్తడి పాత్రలు తోమితే తళతళ లాడతాయి.

87. అరటి చిప్స్ ని వేయించేటప్పుడు ఉప్పు నీళ్ళు చిలకరించి వేయిస్తే కరకరలాడతాయి.

88. లడ్డూలని అర నిమిషం మైక్రో ఓవెన్ లో ఉంచి తీస్తే తాజాగా వుంటాయి.

89. బియ్యాన్ని నిల్వ ఉంచేటప్పుడు ఎండిన పుదీనా ఆకులని మెత్తని పొడిగా చేసి కలిపితే పురుగు పట్టకుండా చక్కని సువాసనతో ఉంటాయి.

90. ఓవెన్ ను శుభ్రపరిచేప్పుడు లోపల వంటసోడా చల్లి రాత్రంతా మూత పెట్టి ఉంచాలి. ఉదయమే ఉప్పు, నిమ్మరసం సమానంగా కలిపి దానిలో ముంచిన స్పాంజితో తుడిస్తే దుర్వాసన పోతుంది.

91. పచ్చి బఠాణీలు నిల్వ ఉండాలంటే వాటిని పాలిథీన్ సంచిలో వేసి డీప్ ఫ్రీజర్ లో ఉంచాలి.

92. పాలు కాచే పాత్రకి అడుగున కొద్దిగా నెయ్యి రాస్తే దానిని శుభ్రపరచడం తేలిక అవుతుంది.

93. మిఠాయిల తయారీకి పంచదార పొడి చేస్తుంటే, నాలుగు బియ్యం గింజల్ని కూడా కలపండి. పొడి ఉండకట్టకుండా ఉంటుంది.

94. ఆకు కూరల్ని కడిగే నీటిలో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ కలిపితే క్రిములు తొలగిపోతాయి.

95. పసుపు నీళ్ళతో వంటింట్లో గట్టును శుభ్రం చేస్తే ఈగలు ముసురుకోవు.

96. కోడిగుడ్లు ఉడికించేప్పుడు పగలకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు ఉప్పు వేయండి.

97. మాంసాహారం వండేప్పుడు అందులో నాలుగు పచ్చి బొప్పాయి ముక్కలు వేస్తే త్వరగా ఉడుకుతుంది.

98. బిర్యానీ చేస్తున్నప్పుడు బియ్యం కడిగిన తరువాత కొద్దిగా నెయ్యి వేస్తే పొడిపొడిగా వస్తుంది.

99. పాలు కాచేప్పుడు గిన్నె అంచులకు నూనె రాస్తే పొంగకుండా ఉంటాయి.

100. పప్పు తొందరగా ఉడకాలంటే దానిలో చిన్న కొబ్బరి ముక్క వేయండి.

101. గారెలు, వడలు చేసే పిండిలో కొద్దిగా సేమియాను పొడిగా చేసి కలిపితే నూనె లాగవు. కరకరలాడతాయి.

102. కూర ఉడుకుతున్నప్పుడు రెండు చెంచాల మొక్కజొన్న పిండి కలిపితే గ్రేవీ చిక్కగా అవుతుంది.

103. క్యాబేజీని ఉడికించేప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే వాసన రాదు.

104. వంకాయ ముక్కలు, అరటి కాయలు నల్లబడకుండా ఉండాలంటే కోసిన తరువాత నీళ్ళలో వేసి దానిలో రెండు చెంచాల పాలు పోయాలి.

105. వెల్లుల్లి రేకల్ని పాలిథీన్ సంచిలో వేసి ఫ్రిజ్ లో ఉంచితే మర్నాడు పొట్టు సులభంగా వస్తుంది.

106. గాజు పాత్రలు తోమేటప్పుడు ఆ నీటిలో రెండు చుక్కలు నీలిమందు కలిపితే శుభ్రపడతాయి. కొత్తవాటిలా ఉంటాయి.

107. గ్రేవీ తయారీలో మసాలాతోపాటు పెరుగు కూడా ఒకేసారి వేస్తుంటే, ముందుగా పెరుగును బాగా గిలకొట్టాలి. అప్పుడే చక్కగా కలుస్తుంది. రుచిగానూ ఉంటుంది.

108. ఆలుగడ్డలు (బంగాళా దుంపల్ని) బేక్ చేయాలనుకున్నప్పుడు ఇరవై నిమిషాల ముందు వాటిని ఉప్పు నీటిలో ఉంచాలి.

109. కప్పులో టీ, కాఫీ తాలూకు మరకలు పడితే, వెనిగర్ లో ఉప్పు వేసి రుద్దితే అవి దూరమవుతాయి.

110. నాన్ స్టిక్ పెనం మీద ఉప్పు చల్లి తడి తువాలుతో రుద్దితే పదార్థాల తాలూకు మరకలు వదిలిపోయి శుభ్రపడుతుంది.

111. బిస్కట్లు, స్నాక్స్ నిల్వ ఉంచే డబ్బా అడుగు భాగంలో బ్లాటింగ్ కాగితం ఉంచితే తేమ చేరకుండా అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

112. అన్నం మెత్తగా ఉడికితే మూత తీసి పైన శుభ్రమైన వస్త్రం కప్పి అరగంటయ్యాక తీస్తే పొడిపొడిగా వుంటుంది.

113. బెండకాయ వేపుడు చేసేటప్పుడు కాసిని పుల్లటి మజ్జిగ చేర్చితే ముక్కలు ఒకదాని కొకటి అతుక్కోకుండా ఉంటాయి.

114. వండగా మిగిలిన పుట్టగొడుగులను కాగితంలో చుట్టి వలలాంటి సంచిలో వేలాడదీస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

115. కందిపప్పును నిల్వ ఉంచిన డబ్బాలో ఎండు కొబ్బరి చిప్పను ఉంచితే పప్పు పురుగు పట్టకుండా ఉంటుంది.

116. వంకాయ ముక్కలు వేసిన నీళ్ళలో రెండు చెంచాల పాలు కలిపితే అవి నల్లగా మారకుండా ఉంటాయి.

117. వంటింట్లో జిర్రపురుగుల (బొద్దింకల) బెడద బాధిస్తుంటే వెల్లుల్లిని దంచి గట్టుమీద, అరల్లో ఉంచండి.

118. ఇంగువ నిల్వ చేసిన డబ్బాలో పచ్చిమిర్చి వేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. మంచి వాసన వస్తుంది.

119. అగరొత్తుల తాలూకు నుసితో ఇత్తడి పాత్రలు తోమితే శుభ్రపడి కొత్తవాటిలా మెరుస్తాయి.

120. ఉప్మారవ్వ పాడయిపోకుండా ఉండాలంటే ముందుగా రవ్వను వేయించి తర్వాత ఫ్రిజ్ లో నిల్వ ఉంచితే ఎంత కాలం అయినా పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే బెల్లం, చింతపండు వంటివి త్వరగా నలుపెక్కకూడదంటే ఫ్రిజ్ లో ఉంచండి.

121. కుంకుమ పువ్వును వాడే ముందు కొద్దిగా వేడి చేసి వంటకాల్లో వేస్తే చక్కటి రంగు, రుచి వస్తాయి.

122. గ్రేవీలో వేయడానికి క్రీమ్ అందుబాటులో లేకపోతే చెంచా చొప్పున మజ్జిగ, పాలు తీసుకొని కలిపితే సరిపోతుంది.

123. పూరీ పిండి కలిపేటప్పుడు దానిలో చెంచా పంచదార కలిపితే చాలాసేపటిదాకా అప్పుడే నూనెలోంచి తీసినవాటిలా పొంగి ఉంటాయి.

124. పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.

125. కాకరకాయ కూర వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.

126. బెండ, దొండ వంటి కూరగాయలను వేయించేటప్పుడు కొద్దిగా వెనిగర్ కలిపితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.

127. ఆహార పదార్థాలు నిల్వ ఉంచిన గిన్నెలకు చీమలు పట్టకుండా ఉండాలంటే అంచులకు ఆముదం రాయాలి.

128. పకోడీలు కరకరలాడుతూ రావాలంటే వాటిలో కొద్దిగా మొక్కజొన్న పిండి కలిపండి.

129. వంటగదిలోకి జిర్రపురుగులు (బొద్దింకలు) రాకుండా ఉండాలంటే మైదాలో బోరిక్ పౌడర్ ను కలిపి ఉండలుగా చేసి మూలల్లో ఉంచాలి.

130. పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్ లో పెట్టి ఫ్రిజ్ లో ఉంచండి.

131. సింక్ గొట్టంలో ఆహార వ్యర్థాలు ఇరుక్కుపోయి దుర్వాసన వస్తుంటే బేకింగ్ సోడాను వేడినీళ్ళలో కలిపి పోస్తే సమస్య పరిష్కారమవుతుంది.

132. కొబ్బరిపాలు కొన్ని గంటలపాటు తాజాగా ఉండాలంటే చిటికెడు ఉప్పు కలపండి.

133. కొత్తిమీర కాడల్ని కత్తిరించి ఆ ఆకులకు నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్ లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

134. క్యారెట్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పై భాగాన్ని కొద్దిగా తరిగితే సరిపోతుంది.

135. వేపుళ్ళు చేసే మూకుడులో కొద్దిగా వెనిగర్ వేసి వేడి చేస్తే ఆ తరువాత పదార్థాలు అంటుకోకుండా ఉంటాయి.

136. బజ్జీల పిండి కలుపుతున్నప్పుడే గుప్పెడు బియ్యం పిండి కూడా చేర్చండి. రుచిగా కరకరలాడతాయి. ఒకవేళ పిండి మరీ పలుచగా మారితే రెండు బ్రెడ్ స్లైసుల్ని నీటిలో నానబెట్టి నిమిషమయ్యాక పిండేసి తరువాత పిండిలో కలపాలి. పిండి చిక్కగా మారుతుంది.

137. సలాడ్ తయారీకి వాడే అరటిపండు ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే వాటిపై కొద్దిగా పంచదార పొడి లేదా నిమ్మరసం చల్లితే సరిపోతుంది.

138. పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.

139. నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గిన్నెలో నీళ్ళు పోసి అందులో కాయలు ఉంచి ఫ్రిజ్ లో పెట్టండి.

140. వంకాయలు కోసినప్పుడు చేతులు నల్లగా అయితే ఆలుగడ్డ (బంగాళా దుంప) ముక్కలతో రుద్దుకోవాలి.

141. కప్పుల్లో కాఫీ, టీ మరకలు వదలకపోతే వెనిగర్ లో ఉప్పు కలిపి రుద్దితే త్వరగా వదిలోపోతాయి.

142. అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.

143. వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.

144. అల్లం, వెల్లుల్లి, చేపలు – వీటితో వంటలు చేసిన తరువాత వంటింట్లో ఎంత వద్దన్నా ఘాటు వాసన వస్తుంది. అలాంటప్పుడు వెడల్పాటి పాత్రలో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో సన్నగా తరిగిన నిమ్మ చెక్కలని వేయండి.

145. గుడ్డు తాజాగా వుందోలేదో తెలుసుకోవాలంటే కప్పు నీళ్ళలో రెండు చెంచాల ఉప్పు వేసి దానిలో గుడ్డుని ఉంచాలి. మునిగితే అది తాజాదే!

146. కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు వేయించిన బియ్యం పిండి ఓ చెంచా కలిపితే సరి.

147. బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.

148. వంటింటి గట్టు జిడ్డుగా ఉంటే సబ్బు నురగలో వెనిగర్, కాసిని గోరువెచ్చటి నీళ్ళు కలిపి స్క్రబ్బర్ తో రుద్దితే సరిపోతుంది.

149. స్టెయిన్ లెస్ స్టీల్ సింక్ ల మీద నీళ్ళ మరకలు తొలగిపోవాలంటే వంటసోడాలో నాలుగైదు చుక్కల వెనిగర్ కలిపి రుద్దాలి. నాలుగైదు గంటల తరువాత చల్లటి నీళ్ళతో కడిగితే కొత్తదానిలా మెరిసిపోతుంది.

150. అరటికాయలు కోసిన తరువాత నల్లబడకుండా ఉండాలంటే వాటిని వేసే నీళ్ళలో నాలుగు చుక్కల వెనిగర్ కలపాలి.

151. గారెల పిండిలో సేమియాను కలిపితే కరకరలాడతాయి.

152. అరటిపండు నల్లబడకుండా ఉండాలంటే ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టండి.

153. ఆపిల్ పండుని కోసేప్పుడు చాకుని నిమ్మరసంలో ముంచి కట్ చేస్తే ఆపిల్ ముక్కలు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.

154. దోశ పిండిలో కొంచెం ఉప్పుడు నూక కలిపితే రుచిగా ఉంటాయి. కరకరలాడుతూ వస్తాయి.

155. నిల్వ పచ్చడిగా చేసుకొనే ఉసిరికాయ (నూరినది) తొందరగా నలుపెక్కకుండా ఉండాలంటే పింగాణీ జాడీలో ఉంచి మధ్యలో చిన్న ఇంగువ ముక్క ఉంచండి.

156. బెండకాయలు భద్రపరుస్తున్నప్పుడు రెండు మూడు రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలతో పాటు రెండో చివరను కూడా కోయాలి. ఈ ముక్కల్ని ప్లాస్టిక్ కాగితంలో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి.

157. ఆకు కూరల కాడలు తొలగించి, పొడి వస్త్రంలో చుట్టి ఫ్రిజ్ లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

158. బొంగు పేలాలు (మరమరాలు) మెత్తబడితే పారేయాల్సిన అవసరం లేదు. రెండు నిముషాలు వేయించండి. మళ్ళీ కరకరలాడతాయి.

159. దొండకాయలు తరిగేటప్పుడు చేతులకు కొద్దిగా నిమ్మరసం రాసుకోండి. వాటి జిగురు చేతులకు అంటుకోకుండా ఉంటుంది.

160. రాగి అల్యూమినియం పాత్రలను తోమేటప్పుడు సబ్బు పొడిలో కాస్త వెనిగర్ కలిపితే కొత్తవాటిలా తళతళలాడతాయి.

161. చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలనుకొన్నప్పుడు శుభ్రం చేసి ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి.

162. మొక్కజొన్నని ఉడికించేటప్పుడు దానిపై ఉండే పీచుని తీయడానికి సమయం పడుతుంది. వాడని శుభ్రమైన టూత్ బ్రష్ తో ప్రయత్నిస్తే పని సులభంగా అవుతుంది.

163. ఉప్పు, వెనిగర్ కలిపిన నీటిలో తరిగిన కూరగాయల్ని వేస్తే శుభ్రపడతాయి. క్రిములు నశిస్తాయి.

164. బూరెల పూర్ణం పలుచగా అయితే దానిలో కొద్దిగా పచ్చి కొబ్బరిని కలుపుకోవచ్చు.

165. పకోడీలు వేస్తున్న నూనెలో కొంచెం ఉప్పు వేస్తే నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి.

166. నిమ్మకాయను మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని దానిలో కాస్త వంట సోడాను కలిపి సింక్ కొళాయిలకు రాసి అరగంట తరువాత కడిగితే మురికి వదిలిపోతుంది.

167. మీల్ మేకర్ ను అల్యూమినియం పాత్రల్లో ఉడికిస్తే గిన్నె నల్లగా మారిపోతుంది.

168. నాన్ స్టిక్ లో చింతపండు వంటి పుల్లని పదార్థాలను ఉడికిస్తే దానికుండే పూత త్వరగా పోతుంది.

169. ఐస్ క్రీం త్వరగా తయారవ్వాలంటే ఫ్రీజర్ లో ఉంచేటప్పుడు దాన్ని అల్యూమినియం పాత్రలో ఉంచాలి.

170. ఉప్పు కలిపిన వెన్నను ఫ్రీజర్ లో ఉంచితే, ఎక్కువ రోజులు తాజాగా వుంటుంది.

171. టమాటాలు బాగా మగ్గినా మరో రెండు రోజులు వాటిని తాజాగా ఉంచాలంటే కాగితం సంచిలో ఉంచి దానిలో ఓ యాపిల్ ను పెట్టండి.

172. మాంసాన్ని సన్నని స్లైసుల్లా తరగాలనుకుంటే, దానిని కాసేపు ఫ్రిజ్ లో ఉంచి, చాకుతో కోస్తే పని సులువవుతుంది.

173. క్రీం అందుబాటులో లేనప్పుడు, దానికి ప్రత్యామ్నాయంగా చీజ్ ను ఎంచుకోవచ్చు. కప్పు పనీర్ ను తీసుకుని మిక్సీలో మెత్తగా చేసి అందులో పెద్ద చెంచాడు నిమ్మరసం, కొద్దిగా మజ్జిగ కలిపితే సరిపోతుంది.

174. బ్రెడ్ స్లైసుల్ని ఫ్రిజ్ లో పెట్టేముందు, వాటి మధ్యలో బటర్ పేపర్ ని ఉంచితే తీసేప్పుడు విరిగిపోకుండా ఉంటాయి.

175. సాంబారు రుచిగా ఉండాలంటే మసాలా పొడిలో కొద్దిగా నిమ్మరసం చేర్చితే సరి.

176. ఎండు ఫలాలను సులువుగా కోయాలంటే చాకుని కాసేపు ఓవెన్ లో ఉంచి తీయండి.

177. కేక్ ను తయారు చేసేటప్పుడు కోడిగుడ్డు, మైదా మిశ్రమం కాస్త మెత్తగానే ఉండేట్లు చూసుకోండి. లేదంటే గట్టిగా అవడమే కాకుండా పొడిబారినట్లు తయారవుతాయి.

178. పూరీ పిండి కలిపాక మస్లిన్ వస్త్రంలో పెట్టి అరగంట తరువాత చేస్తే మృదువుగా వస్తాయి. బాగా పొంగుతాయి.

179. పెసర్లు త్వరగా పుచ్చిపోకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు వెల్లుల్లి రేకలను దంచి వేయాలి.

180. ఖాళీ అయిన పచ్చడి సీసాలో దాని తాలూకు ఘాటు వాసన పోవాలంటే సగం వరకు గోరువెచ్చని నీరు నింపి రెండు చెంచాల వంటసోడా కలిపి కొంచెం సేపు కిందికి మీదికి తిప్పి అలా కాసేపు వదిలేయండి. తరువాత శుభ్రంగా కడిగి వాడుకోండి.

181. ఆలుగడ్డ (బంగాళా దుంప) ల పొట్టుతో వెండి పాత్రలు తోమితే కొత్తవాటిలా తళతళలాడతాయి.

182. చేప ముక్కల్ని బాగా వేయించాల్సి వచ్చినప్పుడు మూకుడులో నూనె బాగా పొంగుతుంది. అలాంటప్పుడు చెదిరిపోకుండా ఉండాలంటే చిటికెడు చింతపండు వేయండి.

183. మాంసాహార వంటకాలు చేస్తున్నప్పుడు కొద్దిగా తేనె చేర్చితే రంగు వస్తుంది. రుచి కూడా బాగుంటుంది.

184. ఒక్కోసారి టమాటా సూప్, కుర్మాల వంటివి పల్చగా అవుతుంటాయి. అలాంటప్పుడు ఎర్ర కందిపప్పును నానబెట్టి మెత్తగా చేసి వేస్తే చిక్కగా వస్తాయి.

185. బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి. నిల్వ ఉంచిన డబ్బాలో కొద్దిగా పుదీనాను ఎండబెట్టి పొడి చేసి చల్లితే సరిపోతుంది.

186. పులుసు కూరల్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళా దుంపను ముద్దగా చేసి కొద్దిగా వేస్తే సరిపోతుంది.

187. గారెల పిండికి మినప్పప్పును నానబెడుతున్నప్పుడు చెంచా పెసరపప్పును కూడా చేర్చండి. గారెలు మెత్తగా వస్తాయి. కమ్మని రుచిలోనూ ఉంటాయి.

188. మినప్పప్పు, రాజ్ మా లాంటివి త్వరగా ఉడకాలంటే, వాటిని ఉడికించే నీటిలో ఉప్పు వేయకపోవడమే మంచిది.

189. సమోసా కరకరలాడుతూ రావాలంటే మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండిని కలిపితే సరి.

190. ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్ళలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.

191. గార్లిక్ బ్రెడ్ అందుబాటులో లేనప్పుడు కొన్ని వెల్లుల్లి రేకలను మెత్తగా చేసుకొని ఓ గంటపాటు పెరుగులో నానబెట్టాలి. తరువాత దాన్ని బ్రెడ్ స్లైసుల మీద పరిచి టోస్ట్ చేస్తే సరి.

192. మగ్గు వేడి నీళ్ళలో రెండు చెంచాల వంటసోడా, కాస్త వెనిగర్ కలిపి దానిలో ముంచిన స్పాంజితో వంటింటి గట్టు తుడిస్తే జిడ్డు వదలడమే కాకుండా సూక్ష్మక్రిములూ నశిస్తాయి.

193. కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.

194. గోధుమ రవ్వ ప్లాస్టిక్ కవర్లో పోసి ఫ్రిజ్ లో ఉంచితే పురుగు పట్టకుండా చాలా కాలం తాజాగా ఉంటుంది.

195. సేమియా ఉప్మా మిగిలిపోతే అందులో తగినంత సెనగపిండి, ఉప్పు వేసి గరిటె జారుగా కలిపి పెట్టుకోవాలి. పిండిని కాగుతున్న నూనెలో పకోడీల్లా వేసి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. వేడి వేడి సేమియా పకోడీ ఎంతో రుచిగా ఉంటుంది.

196. బెండకాయ కూర వండేటప్పుడు రెండు చుక్కల వెనిగర్ కలిపితే అంటుకోకుండా ఉంటాయి.

197. టమాటా, పండు మిరపకాయ పచ్చళ్ళు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.

198. రాగి పాత్రల్ని కాస్త నిమ్మ ఉప్పు, వంటసోడా కలిపి తోమితే తళతళలాడతాయి.

199. థర్మాస్ ఫ్లాస్క్ లో దుర్వాసన పోవాలంటే, ఓ చెంచాడు పంచదార వేసి బాగా కుదిపి గోరువెచ్చని నీటితో కడగాలి.

200. కచోరీలు, కుల్చా రొట్టెలు చేస్తున్నప్పుడు వాటి తయారీలో వాడే పిండికి పెద్ద చెంచాడు వేడినూనె కూడా కలపాలి. అప్పుడే అవి మెత్తగా, రుచిగా వస్తాయి.

201. కూరల్లో అల్లం వెల్లుల్లి ముద్ద వాడుతున్నప్పుడు రెండూ సమానంగా కాకుండా, వెల్లుల్లి అరవై శాతం, అల్లం నలభై శాతం ఉండేలా చూసుకోవాలి. లేదంటే కూరలు మరీ ఘాటుగా ఉంటాయి.

202. గ్రేవీ తయారీలో చన్నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళూ, కొద్దిగా పంచదార కూడా కలిపితే మరింత రుచిగా ఉంటుంది.

203. ఉప్పు, వెనిగర్ కలిపిన మిశ్రమంలో గ్యాస్ స్టవ్ ను తుడిస్తే మురికి, జిడ్డు వదిలిపోతుంది.

204. సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకులతో గరంమసాలా పొడి, మిరపపొడి, ఉప్పు, తగినంత నిమ్మరసం కలిపితే రుచికరమైన సలాడ్ తయారవుతుంది.

205. బూరెల పిండికి మినప్పిండి, బియ్యం పిండి, మైదా పిండి సమాన పాళ్ళలో కలిపి ఉంచితే అవి చల్లారినా మెత్తగానే ఉంటాయి.

206. పూరీలను ఒత్తేటప్పుడు పొడి పిండి కాకుండా నూనెతో ఒత్తితే మూకిట్లో అడుగున మసి రాకుండా ఉంటుంది.

207. పెరుగుపై తేలిన నీటిని పారేయకుండా చపాతీ పిండి కలపటానికి వాడితే అవి మెత్తగా వస్తాయి.

208. దోశలపై వేసుకొనే పచ్చిమిర్చి ముక్కలు కారంగా అనిపించకుండా ఉండాలంటే వాటికి ఉప్పు రాసి వెయ్యాలి.

209. బియ్యం కడిగిన నీటిలో కాకరకాయ ముక్కల్ని వేస్తే వాటి చేదు తగ్గుతుంది.

210. దోశలపిండి రుబ్బేటప్పుడు కొద్దిగా సగ్గుబియ్యం కూడా కలిపి చూడండి. అవి విరగకుండా, పలుచగా వస్తాయి.

211. చల్ల మిరపకాయలు ఊరబెట్టేటప్పుడు మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం కూడా పిండండి. ఇలా చేస్తే మిరపకాయలు నల్లబడకుండా ఉంటాయి.

212. చిటికెడు ఇంగువను వస్త్రంలో మూటలా కట్టి కారం నిల్వ ఉంచిన డబ్బాలో ఉంచాలి. ఇలా చేస్తే కారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

213. సాంబారు ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే పప్పు ఉడకపెట్టేప్పుడు కొన్ని లవంగాలు చేర్చితే సరిపోతుంది.

214. ఇడ్లీ పిండిలో చెంచా నూనె కలిపి వేసుకుంటే ఇడ్లీలు దూదిలా మృదువుగా వస్తాయి.

215. పచ్చడి సీసాలను కడిగిన తరువాత చెంచా వంటసోడా వేసి మూత పెడితే మిగిలిన ఘాటైన వాసనలను అది పీల్చేసుకుంటుంది.

216. మసాలా దినుసుల నుంచి ఘాటు వాసన తగ్గిందా? వాటిని మూకుడులో కాసేపు వేయిస్తే సరిపోతుంది.

217. శుభ్రం చేసిన మిక్సీజార్ లో చెంచా వంటసోడా వేసి మూతపెట్టి ఉంచి తరువాత రోజు కడిగితే ఘాటైన వాసనలు పోతాయి.

218. గ్రేవీ కూరల్లో వేసేందుకు క్రీమ్ అందుబాటులో లేనప్పుడు మీగడ కూడా వేయొచ్చు. అదే రుచి వస్తుంది.

219. చీజ్ ను అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

220. బాగా మగ్గిన టమాటాలు గుజ్జుగా తీసి ఐస్ ట్రేలో పోసి ఓ రోజంతా ఫ్రీజర్ లో ఉంచి మరుసటిరోజు ప్లాస్టిక్ బ్యాగుల్లోకి మార్చి ఫ్రిజ్ లో పెట్టాలి. వీటిని ఓ వారం, పదిరోజుల పాటు కూరల్లో వాడుకోవచ్చు.

221. కేక్ తయారీలో వాడే గుడ్లను ఫ్రిజ్ లోంచి తీసిన వెంటనే మిశ్రమంలో వేయడం వల్ల సొన పిండిలో సరిగ్గా కలవదు. అందుకే చల్లగా ఉన్న గుడ్లను పది నిమిషాలు వేడి నీటిలో ఉంచి ఆ తరువాత కలపాలి.

222. మాంసం వండేప్పుడు టీస్పూన్ పొప్పడిపండు (బొప్పాయి) గుజ్జు వేస్తే ఇది మాంసాన్ని మృదువుగా మార్చేస్తుంది.

223. క్యాలీఫ్లవర్ పువ్వుల్ని వేరుచేసిన వెంటనే వండేయకూడదు. ఉప్పు, వెనిగర్ వేసిన నీటిలో పదిహేను నిమిషాలు ఉంచాలి. అలాచేస్తే వాటిల్లోని మురికి మాత్రమే కాదు, పురుగుల్లాంటివి ఉన్నా పోతాయి.

224. అల్లం వెల్లుల్లి పేస్టు చేస్తున్నప్పుడు చిటికెడు ఉప్పు, కొద్దిగా వెనిగర్ కూడా కలిపి నిల్వ చేసుకుంటే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

225. నిమ్మకాయ గట్టిగా మారినప్పుడు రెండు మూడు నిమిషాలు వేడినీళ్ళలో ఉంచితే రసం బాగా వస్తుంది.

226. పనీర్, చీజ్ లను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలంటే కాస్త వెన్న రాసి బ్లాటింగ్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో ఉంచండి.

227. పుదీనాను ఎక్కువ రోజులు నిల్వ చేయడం కష్టం. అలాంటప్పుడు ఆకులను ఎండలో రెండ్రోజులు ఉంచి వడలిపోయాక, పొడి చేసి గాలిచొరని ప్రదేశంలో ఉంచాలి. ఇక అవసరానికి వెతుక్కోవాల్సిన పనుండదు.

228. తాజా కాఫీ గింజల్ని ఫ్రిజ్ లో ఉంచితే ఆహార పదార్థాల తాలూకు ఘాటైన వాసనల్ని అవి పీల్చేసుకుంటాయి.

229. వంటింట్లో ఉండే అరల అడుగున ఉప్పు చల్లి ఆ తరువాత సరుకులున్న డబ్బాలను సర్దండి. ఇలా చేయడం వల్ల చీమల బెడద వదులుతుంది.

230. ఆమ్లెట్ ఉబ్బినట్టు రావాలంటే సొనలో ముందు చిటికెడు ఉప్పు వేసి బాగా గిలకొట్టండి. ఆ తరువాతే రుచికి తగినట్లుగా మరికాస్త ఉప్పు కలపాలి.

231. కొద్దిగా తడిపిన కాగితంలో పుదీనా, కొత్తిమీరలను ఉంచి గాలి చొరని ప్లాస్టిక్ కాగితంలో ఉంచి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సువాసన పోదు.

232. టమాటాలు పచ్చిగా ఉన్నాయా? ఒక్కోదాన్ని విడివిడిగా చిన్న చిన్న న్యూస్ పేపర్ల ముక్కల్లో చుట్టి గది ఉష్ణోగ్రతలో ఉంచండి. మర్నాటికల్లా పండుతాయి.

233. కేక్ రుచిగా రావాలంటే, కప్పు మైదా పిండి తీసుకుని, రెండు చెంచాలు తీసేయండి. బదులుగా రెండు చెంచాల మొక్కజొన్న పిండి కలపండి.

234. శనగలు, గోధుమలు పురుగు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే, వాటిని ఉంచిన డబ్బాల్లో రెండు మూడు ఉల్లిపాయల్ని ఉంచాలి.

235. బియ్యం నిల్వ ఉండాలంటే బియ్యం సంచుల్ని తలుపులూ, కిటికీలకు దూరంగా ఉంచాలి. డబ్బాలో పోసే ముందు అడుగున ఎండబెట్టిన వేపాకుల్ని ఉంచాలి. బియ్యం పోసాక పైన కొన్ని వేపాకుల్ని ఉంచితే పురుగు పట్టదు.

236. కందిపప్పు, పెసరపప్పు వంటి వాటిని నిల్వ ఉంచడానికి బిగుతుగా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు వాడటం మేలు. ఇవి పురుగులను త్వరగా ఆకర్షించవు. అడుగున కొంచెం దొడ్డుప్పు వేస్తే మరీ మంచిది.

237. పిండి పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని ఎండు మిరపకాయల్ని డబ్బాలో వేయాలి. రాళ్ళ ఉప్పును కాటన్ వస్త్రంలో చుట్టి మధ్యలో ఉంచినా మంచిదే.

238. కోడిగుడ్లను అల్యూమినియం పాత్రలో ఉడకబెట్టొద్దు. పాత్రకి ఉండే ఆమ్ల గుణంవల్ల అవి నల్లబడతాయి.

239. పప్పు తొందరగా ఉడకాలంటే దాంతో పాటు చిన్న పచ్చికొబ్బరి ముక్క వేస్తే సరి.

240. ముదిరిపోయిన సొరకాయ గింజల్ని బియ్యంతో కలిపి నానబెట్టి రుబ్బి దోసెల్లా వేస్తే రుచిగా ఉంటాయి.

241. వేపుళ్ళు చేస్తున్నప్పుడు కూరగాయ ముక్కల్లో కాస్త వెనిగర్ కలిపితే నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి.

242. పచ్చడి ఎర్రగా కనిపించాలంటే చివరగా పోపు వేసేప్పుడు చిటికెడు వంటసోడా వేయాలి.

243. పిల్లల లంచ్ బాక్సులు కడిగి తుడిచి కాస్త వంటసోడా వేసి మూత పెడితే, ఆహార పదార్థాల తాలూకు వాసనలు రాకుండా ఉంటాయి.

244. నెయ్యి తాజాగా ఉండాలంటే గిన్నె అడుగున చిన్న బెల్లం ముక్క వేస్తే సరి.

245. ఏదయినా కూరల్లో వెల్లుల్లిని ముక్కల్లా వేయాలనుకుంటే, ముందు వాటిని దోరగా వేయించండి. మెత్తగా ఉంటాయి. పదార్థాలకూ మంచి రుచి వస్తుంది.

246. సలాడ్ లో క్యారెట్ ని వాడుతుంటే దాన్ని తరిగేందుకు గంట ముందు చల్లని నీటిలో ఉంచండి. ఇలా చేస్తే క్యారెట్ ముక్కలు కరకరలాడతాయి.

247. వేపుళ్ళు చేస్తున్నప్పుడు కూరగాయ ముక్కల్లో కాస్త వెనిగర్ లేదా నిమ్మరసం కలిపితే నూనె ఎక్కువ పీల్చుకోవు.

248. ఫ్రిజ్ లో పెట్టిన వెన్నలో ఒక తమలపాకు వేస్తే పులిసిపోకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది.

249. మజ్జిగ చిలికేప్పుడు వెన్న త్వరగా రావాలంటే కాస్త రాళ్ళ ఉప్పు వేస్తే సరిపోతుంది.

250. కూరగాయల్ని పసుపు కలిపిన నీటిలో కడిగితే, సూక్ష్మక్రిములు తొలగి శుభ్రపడతాయి.

251. మసాలా కూరల్లో ఘాటు లేదా కారం ఎక్కువయిందనుకుంటే, కొద్దిగా పెరుగు లేదా క్రీం కలిపి కాసేపు పొయ్యిమీద ఉంచండి. కూర కమ్మగా మారుతుంది.

252. ఉల్లి, వెల్లుల్లి తరిగిన చాకు నుంచి ఆ వాసనలు పోవాలంటే, చాకును నిమ్మ చెక్కతో రుద్దితే సరిపోతుంది.

253. పిల్లలు తాగే నీళ్ళ సీసాలను కాస్త రాళ్ళ ఉప్పూ, చిటికెడు బేకింగ్ సోడా వేసి కడిగితే శుభ్రపడడమే కాకుండా సూక్ష్మక్రిములు నశిస్తాయి.

254. కోడిగుడ్లు ఉడికించే నీటిలో కొంచెం వంటసోడా వేస్తే వాటి పెంకులు సులువుగా ఊడివస్తాయి.

255. గుడ్డుసొన గిలకొట్టేప్పుడు చెంచా చల్లని నీళ్ళు చేర్చండి. ఇలా చేస్తే ఆమ్లెట్ పెద్దగా వస్తుంది.

256. అప్పడాలను నూనెలో వేయించాలని లేదు. వాటికి కొద్దిగా నూనె రాసి నిప్పులపై కాల్చినా సరిపోతుంది. వేయించిన రుచే వస్తుంది.

257. కొన్ని పదార్థాల తయారీలో క్రీం అవసరం అవుతుంది. దాన్ని బయటే కొనాలని లేదు. పాలను కాచి మూత పెట్టకుండా ఓ రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచాలి. మర్నాడు పాలపై పేరుకున్న మీగడను జాగ్రత్తగా తీసుకుంటే ఇన్‌స్టంట్ క్రీం సిద్ధమైనట్లే.

258. ఫ్రైడ్ రైస్ తయారీ కోసం వండే అన్నం రుచిగా ఉండాలంటే, బియ్యంలో నీళ్ళతో పాటు కొద్దిగా కొబ్బరి పాలు కలపండి.

259. కొద్దిగా నూనె వేడిచేసి అందులో అరచెంచా చక్కెర వేయండి. ఈ నూనెను మసాలా కూరల్లో వేస్తే అవి చాలా రుచిగా ఉంటాయి.

260. సలాడ్ ని ఉంచే గిన్నె లేదా ట్రేని చిల్లర్ లో కాసేపు ఉంచి అందులో సలాడ్ ముక్కలు పెడితే సలాడ్ ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.

261. మష్రూమ్ (పుట్టగొడుగులు) లని ప్లాస్టిక్ బ్యాగ్ లో కాకుండా పేపర్ బ్యాగుల్లో చుట్టిపెడితే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.

262. మొక్కజొన్న పొత్తుని ఉడికించే నీళ్ళలో చిటికెడు పంచదార వేసి ఉడికిస్తే రుచిగా ఉంటుంది.

263. మాంసం ముక్కల్లో క్యారెట్ వేసి ఉడికిస్తే కొవ్వుని క్యారెట్ పీల్చుకుంటుంది. ఉడికిన క్యారెట్ ను బయటకు తీసి మిగతా కాయగూరలతో కలిపి సూప్ కూడా చేసుకోవచ్చు.

264. పిండిని పూరీల్లా చేశాక వాటిని ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత వేగిస్తే పూరీలు తక్కువ నూనె పీల్చుకుంటాయి. కరకరలాడతాయి.

265. రాజ్మా, మినప్పప్పుల్ని ఉప్పు వేయకుండా ఉడికించాలి.

266. వేపుళ్ళకు వాడిన నూనె నల్లగా అయితే అందులో ఒక టీస్పూన్ తెలుపు వెనిగర్ వేసి మూతపెట్టి సన్నటి మంట మీద వేడిచేయాలి. చిటపటమనడం ఆగిపోయాక వడపోస్తే ఆ నూనె మళ్ళీ వాడెందుకు పనికొస్తుంది.

267. ఉల్లిపాయ ముక్కల్ని నూనె వేయకుండా వేగిస్తే వాటి చెమ్మ పోతుంది. ఆ తరువాత కొద్దిగా నూనె వేసి వేగించుకుంటే తక్కువ నూనె పడుతుంది. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి.

268. చపాతీ పిండి కలుపుతున్నప్పుడు చేతులకు కొద్దిగా ఉప్పు రాసుకుంటే, పిండి చేతులకు అంటుకోకుండా ఉంటుంది.

269. సాంబారు రుచిగా రావాలంటే దాని తయారీ అంతా పూర్తయ్యాక నాలుగైదు చుక్కల నిమ్మరసం పిండి మూత పెట్టేస్తే సరిపోతుంది.

270. చేపల్ని శుభ్రం చేశాక సింకు నుంచి ఆ వాసన పోవాలంటే కొద్దిగా షాంపూ వేసి కడగండి.

271. కొద్దిగా నూనె వేడిచేసి అందులో అర చెంచా చక్కెర వేయండి. ఈ నూనెను గ్రేవీల్లాంటి మసాలా కూరల్లో వేస్తే అవి చాలా రుచిగా ఉంటాయి.

272. క్యారెట్ దుంపల్ని పలుచని తడి వస్త్రంలో ఉంచితే రెండు రోజుల వరకూ వడలిపోకుండా ఉంటాయి.

273. పూరీలు కరకరలాడుతూ రావాలంటే పూరీ పిండిలో కొద్దిగా రవ్వ, చక్కెర కలిపి చూడండి.

274. ఉల్లిపాయలు అందుబాటులో లేనప్పుడు కూరలో కొద్దిగా ఇంగువా, చెంచా అల్లం రసం కలపండి. కూరకు మంచి రుచి వస్తుంది.

275. వడల పిండిలో కొద్దిగా నెయ్యి కలపండి. అవి కరకరలాడుతూ ఉంటాయి. తక్కువ నూనె కూడా పీల్చుకుంటాయి.

276. పచ్చిమిర్చిని నిల్వ చేస్తున్నప్పుడు వాటిని వేసిన కవరులో కొద్దిగా పసుపు కూడా వేయండి. ఇలా చేస్తే పచ్చిమిర్చి ఎర్రగా మారవు.

277. టమాటా ప్యూరీ అందుబాటులో లేనప్పుడు దాన్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. టమాటాల పొట్టూ, గింజలూ తీసేసి ముక్కల్లా తరగాలి. ఈ ముక్కల్ని కొద్దిగా నూనె వేసి గుజ్జులా అయ్యేదాకా మగ్గిస్తే సరిపోతుంది.

278. టమాటా, ఉల్లిపాయ ముక్కల్ని వేయిస్తున్నప్పుడు కొద్దిగా ఉప్పు చల్లండి. త్వరగా వేగుతాయి. రుచిగానూ ఉంటాయి.

279. పదార్థాలు చిక్కగా అయ్యేందుకు, శనగపిండి లేదా బియ్యం పిండి కలపాలని లేదు. టమాటా ప్యూరీ, కొబ్బరిపాలూ లేదంటే గిలకొట్టిన పెరుగును కలిపినా సరిపోతుంది.

280. పకోడీ కరకరలాడాలంటే శనగ పిండికి కొంచెం మొక్కజొన్న పిండి కలిపితే సరి.

281. పకోడీ, జంతికల పిండి కలిపేటప్పుడు కాసిని పాలు వేసి కలిపితే, రుచిగా వస్తాయి.

282. పాలు మాడు వాసన వస్తున్నప్పుడు, దానిలో ఒక తమలపాకు వేసి మళ్ళీ కాస్తే మాడు వాసన పోతుంది.

283. కాకరకాయల్ని మామూలుగా కాకుండా ముక్కల్లా తరిగి, ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

284. కాకరకాయలు మరీ చేదుగా ఉంటే, చిన్న ముక్కలుగా కోసి ఉప్పు రాసి, కాసేపు పక్కనుంచితే చేదు తగ్గుతుంది.

285. పచ్చిమిర్చిని ఎక్కువగా తరగాల్సి వచ్చినప్పుడు, చేతులకు కొద్దిగా నూనె రాసుకోవాలి. తరువాత చేయి మంటగా అనిపించదు.

286. ఆకుకూరలు ఉడికించే నీటిలో కొద్దిగా నిమ్మరసం కూడా పిండాలి. ఇలా చేస్తే ఆకు కూరలు రంగు మారకుండా ఉంటాయి.

287. పాత్రలు మాడిపోయి, శుభ్రపరచడం కష్టంగా ఉంటే కొన్ని తరిగిన ఉల్లిపాయ ముక్కలూ, వేడినీళ్ళూ వేసి కాసేపు నానబెట్టాలి. శుభ్రం చేయడం తేలికవుతుంది.

288. రోజూ వాడుకునే కారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, దానిలో కొద్దిగా మెత్తటి ఉప్పు కలిపి, గాలి చొరని డబ్బాలో ఉంచుకుంటే సరిపోతుంది.

289. పుదీనా ఆకులు ఎండిపోతే పారేయాల్సిన అవసరం లేదు. వాటిని ఎండబెట్టి పొడి చేసి బియ్యంలో కలుపుకొంటే పురుగు పట్టకుండా ఉంటుంది.

290. బంగాళా దుంప ముక్కల్ని పది నిమిషాలు మజ్జిగలో ఉంచి తరువాత వేయిస్తే కరకరలాడుతూ వస్తాయి. రుచిగా ఉంటాయి.

291. కూరగాయలు కోసాక చేతులు నల్లబడకుండా ఉండాలంటే ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో రుద్దుకుంటే సరి.

292. పకోడీలు, పూరీలు వేయిస్తున్నప్పుడు మూకుడులో చిటికెడు ఉప్పు వేస్తే వాటికి తక్కువ నూనె పడుతుంది.

293. బజ్జీల పిండిలో కొద్దిగా మొక్కజొన్న పిండి కలిపితే కరకరలాడుతూ రుచిగా వస్తాయి.

294. గాజు పాత్రలను కొద్దిగా సున్నం కలిపిన నీటిలో కడిగితే మురికి వదిలి కొత్తవాటిలా కనిపిస్తాయి.

295. చికెన్ ఉడికించేటప్పుడు ఏవయినా కూరగాయ ముక్కలు కలిపితే త్వరగా ఉడుకుతుంది. పోషకాలు కోల్పోకుండా ఉంటాయి.

296. ఉడుకుతున్న బంగాళా దుంపలు రంగు మారకుండా ఉండాలంటే రెండు చుక్కలు నిమ్మరసం వేయండి.

297. కరివేపాకు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే అవి ఉంచిన డబ్బాలో మెంతి గింజలు వేసి గాలి చొరబడకుండా మూత బిగిస్తే చాలు.

298. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే, కూరలో ఒక చెంచా పాలు పోయాలి.

299. పూరీల్లాంటివి వేయించినప్పుడు మూకుడు అడుగున నల్లగా పేరుకుంటుంది. ఐదారు వెల్లుల్లి రెబ్బలు అందులో వేసి పొయ్యిమీద పెట్టండి. కాసేపటికి పేరుకున్న నల్లని మిశ్రమం అంతా ఆ రెబ్బలకు అంటుకుంటుంది. అప్పుడు వాటిని తీసేసి నూనెను వడకట్టండి.


300. నానబెట్టిన గోరింటాకు పొడితో వెండి వస్తువుల్ని శుభ్రం చేసి చూడండి. కొత్తవాటిలా మెరుస్తాయి.

301. పాలతో కాకుండా ఇతర తీపి పదార్థాలు చేస్తున్నప్పుడు చిటికెడు ఉప్పు వేయడం మరవకండి. పదార్థాలు మంచి రుచిగా ఉంటాయి.

302. పప్పులకు పురుగు పట్టకుండా ఎక్కువరోజులు తాజాగా ఉండాలంటే, వాటిని నిల్వ చేసే డబ్బాలో అడుగున నాలుగైదు వెల్లుల్లి రేకలు వేయాలి.

303. కొబ్బరి ముక్కలు నిల్వ ఉన్నా వాసన రాకుండా ఉండాలంటే, చిప్పల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తే సరి.
304. కేక్ పై ఐసింగ్ సమంగా పరచుకోవాలంటే, కేక్ తయారైన వెంటనే దానిపై కొద్దిగా మైదా చల్లి, అప్పుడు ఐసింగ్ పరవండి.

305. కాకరకాయ ముక్కలు చేదు పోవాలంటే పెరుగు, కొద్దిగా గోధుమ పిండి, ఉప్పు కలిపిన మిశ్రమంలో కాసేపు ఈ ముక్కల్ని నానబెట్టి తరువాత వండాలి.

306. బాదం, వేరుశనగ, జీడిపప్పు వంటివాటిని డబ్బాల్లో పెట్టే బదులు, ప్లాస్టిక్ సంచుల్లో వేసి ఫ్రిజ్ లో ఉంచినపుడు త్వరగా మెత్తబడిపోవు. రుచీ మారదు.

307. బిస్కట్లు నిల్వ చేసే డబ్బాలో అడుగున ఒక బ్రెడ్ స్లైస్ ను వేయండి. బిస్కెట్లు మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటాయి.

308. చక్కెరను పొడిలా చేస్తున్నప్పుడు కొన్ని బియ్యపు గింజలు కూడా వేయండి. ఇలా చేస్తే చక్కెర ముద్ద కాకుండా పొడిలా వస్తుంది.

309. ఫ్రిజ్ లో ఉంచి తీసిన చల్లని కప్పుల్లో ఐస్ క్రీం వేస్తే, త్వరగా కరిగిపోకుండా ఉంటుంది.

310. నిమ్మజాతి పండ్లూ, టమాటాల్లంటి వాటిని ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఫ్రిజ్ లో ఉండే తక్కువ ఉష్ణోగ్రత వాటిల్లోని సువాసనను తగ్గిస్తుంది.

311. పదార్థాల్లో బ్రెడ్ పొడి వేయాల్సి వచ్చి, అది అందుబాటులో లేనప్పుడు, ఓట్స్ పొడిని వాడొచ్చు.

312. వంటింట్లో వాడే స్పాంజిలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన చన్నీళ్ళలో కాసేపు నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు పోతాయి. దుర్వాసన కూడా ఉండదు.

313. పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రాకుండా ఉంటాయి.

314. తేనె మరీ ముద్దగా అయితే, కాసేపు అది ఉన్న సీసాను వేణ్ణీళ్ళలో ఉంచండి. వాడుకోవడానికి వీలుగా అవుతుంది.

315. ప్లాస్టిక్ డబ్బాలు వాడనప్పుడు వాటిల్లో కాస్త ఉప్పు వేసి ఉంచితే, తిరిగి వాడుకునేప్పుడు ప్లాస్టిక్ వాసన రాదు.

316. కొబ్బరిపాలల్లో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలున్నా, అందులో కొవ్వుశాతం ఎక్కువ. అందుకే ఏదయినా పదార్థంలో దాని మోతాదును తగ్గించి టమాట గుజ్జు వాడండి. గసగసాల పేస్టు కూడా వేసుకోవచ్చు.

317. తోటకూర, కొత్తిమీర వంటి ఆకుకూరల్ని చాపింగ్ బోర్డు మీద చాకుతో కోసేప్పుడు సరిగా తరగలేరు. అలాంటప్పుడు బోర్డు మీద కొంచెం టేబుల్ సాల్ట్ చల్లితే, తరగడానికి అనువుగా ఉంటుంది.

318. పండిపోయిన టమాటలను ఉప్పు కలిపిన చల్లని నీటిలో రాత్రంతా ఉంచితే, పొద్దుటికల్లా తాజాగా మారుతాయి.

319. రెండు వారాలకోసారి సింక్ ని నిమ్మనూనె లేదా బేబీ ఆయిల్ తో తుడవడం వల్ల అక్కడ తడి నిలవదు. ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉండదు.

320. స్పాంజితో వంటింటి గట్టు తుడిచాక, దాన్ని కడిగి పిండేసి, మూడు నిమిషాలు మైక్రో ఓవెన్ లో ఉంచితే క్రిముల సమస్య ఉండదు.

321. ఆలుగడ్డలు (బంగాళా దుంపలు) ఉడికించేప్పుడు ఆ నీళ్ళలో రెండు చుక్కల నిమ్మరసం లేదా కాస్త వెనిగర్ వేస్తే తెల్లగా వస్తాయి.

322. ఫ్రెంచి ఫ్రైస్ చేస్తున్నప్పుడు ఆలుగడ్డల్ని (బంగాళా దుంపల్ని) ఐదు నిమిషాలు నీటిలో ఉంచి, తరువాత తుడిచి పొడుగు ముక్కల్లా తరగాలి. దానివల్ల వాటిలోని గంజిశాతం తగ్గి, వేయిస్తున్నప్పుడు మూకుడుకు అంటుకోకుండా ఉంటాయి. ఇవి కరకరలాడేలా రావాలంటే వాటిని వేయిస్తున్నప్పుడు కొద్దిగా మొక్కజొన్న పిండిని చల్లండి.

323. కొద్దిగా క్రీం, చిక్కటి పుల్లటి మజ్జిగ, నిమ్మరసం, పంచదార పాకం జత చేసి కేక్ మిశ్రమంలో బేకింగ్ పౌడర్ కి బదులుగా వాడొచ్చు. దీనివల్ల కేక్ మృదువుగా వస్తుంది.

324. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలంటే చిటికెడు బేకింగ్ సోడా వేస్తే సరి.

325. క్యాలీఫ్లవర్ ఉడికించేప్పుడు కాసిని పాలు పోస్తే కూర రంగు మారదు.

326. ఉల్లిపాయలు తరిగేటప్పుడు చేతులకు కొద్దిగా వెనిగర్ రుద్దుకొని ఆ పనిచేయండి. చేతులు ఉల్లి వాసన రాకుండా ఉంటాయి.

327. గుడ్లు ఉడికిస్తున్నప్పుడు నీళ్ళలో చెంచా వెనిగర్ వేస్తే తెల్లసొన బయటకు రాకుండా ఉంటుంది.

328. అప్పడాలు వేయించే ముందు కొన్ని నిమిషాలు ఎండలో ఉంచితే అవి ఎక్కువ నూనెను పీల్చుకోవు.

329. దోశలపిండి రుబ్బేప్పుడు కొద్దిగా చక్కెర కూడా వేస్తే, అవి ఎర్రగా మంచి రుచిలో వస్తాయి.

330. బెండకాయల్లాంటి వాటిని తరిగేప్పుడు చాకు జిగురుగా మారి తరగడానికి వీలుగా లేకపోతే వెనిగర్ లో ముంచిన స్పాంజితో తుడవండి.

331. కొబ్బరి నుంచి పాలు తీస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్ళు వాడటం మంచిది. దానివల్ల కొబ్బరి నుంచి పాలు సులువుగా, ఎక్కువగా వస్తాయి.

332. సాంబారు మరీ పల్చగా ఉన్నప్పుడు చెంచా చెంచన్నర శనగపిండిలో కొద్దిగా చక్కెర వేసి నీళ్ళతో పేస్టులా చేయండి. దీన్ని సాంబారులో వేసి మరిగిస్తే చిక్కగా మారుతుంది.

333. కూరగాయలు వడలిపోయినట్టు అయితే, నీటిలో వేసి నిమ్మరసం పిండితే కాసేపటికి తాజాగా మారతాయి.

334. వంటకాల్లో ఉల్లిపాయ వాసన ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాటిని వేయించే ముందు కొద్దిగా పంచదార వేయాలి.

335. పూరీలు మృదువుగా రావాలంటే పిండిని వేడి నీళ్ళూ, పాలతో కలిపి అరగంట సేపు రుమాలులో చుట్టి ఉంచాలి.

336. కలిపిన చపాతీ పిండిపై తడిబట్టను కప్పితే అది ఎండిపోకుండా ఉంటుంది.

337. పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే, తోడుకున్నాక దానిపై ఒకటి రెండు చిన్న కొబ్బరి ముక్కల్ని ఉంచండి.

338. మొక్కజొన్నలు ఉడికించేప్పుడు చెంచా నిమ్మరసం చేరిస్తే రంగు మారకుండా ఉంటాయి. మంచి రుచి వస్తుంది.

339. ఆలుగడ్డ (బంగాళా దుంప) లు త్వరగా ఉడకాలంటే, ఆ నీటిలో కాస్త నిమ్మరసం వేయండి.

340. కరివేపాకును ఎండబెట్టి, పొడిచేసి భద్రపరచుకొని, నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.

341. బొంబాయి రవ్వ ఉప్మా ఉండలు కట్టకుండా పొడిపొడిగా రావాలంటే రవ్వకు రెండు చెంచాల నూనె కలపండి.

342. క్యాబేజీ వండేటప్పుడు అందులో చెంచా నిమ్మరసం కలిపితే కూర వాసన రాకుండా ఉంటుంది.

343. వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.

344. క్యాబేజీ కూర వండేప్పుడు అందులో కొద్దిగా నిమ్మ ఉప్పు వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది.

345. బియ్యం కడిగిన నీళ్ళతో చేతులు కడుక్కుంటే చేపలు కడిగేటప్పుడు చేతికి అంటుకున్న వాసన సులభంగా పోతుంది.

346. చారు మరిగేటప్పుడు ఒక బెండకాయను నాలుగు ముక్కలుగా చేసి అందులో వేస్తే రుచి చాలా బాగుంటుంది.

347. బెండకాయలను వండేటప్పుడు మామూలుగా కంటే ఒక చెంచా నూనె ఎక్కువ వేసి ఉప్పు ఆఖరున వేస్తే అవి అతుక్కోవు. రుచిగానూ ఉంటుంది.

348. బెండకాయలను వండేప్పుడు పైన మూత పెట్టకుండా ఉడికిస్తే కూర జిగురుగా వుండదు.

349. టీ డికాక్షన్ లో డిటర్జెంట్ కలిపి పాత్రలను తోమితే కోడిగుడ్డు సొన వాసన త్వరగా వదిలిపోతుంది.

350. కుక్కర్ అడుగు భాగం నల్లగా మారితే, అందులో గ్లాసుడు నీళ్ళు పోసి కాగితం పరిస్తే మర్నాటికి తెల్లబడుతుంది.

351. కూర మరీ పలుచగా తయారైతే, తాజా బ్రెడ్ ముక్కలని తీసుకొని పొడిచేసి కూరలో వేయండి. చిక్కబడుతుంది.

352. ఇడ్లీ, దోశ పిండి మర్నాటికి పులవకుండా ఉండాలంటే గిన్నెమీద తడి వస్త్రం కప్పాలి.

353. సీసాలో నుంచి తేనెను సులువుగా బయటకు తీయాలంటే ముందుగా చెంచాను వేడిచేయాలి.

354. మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే కేకు మరింత రుచిగా వస్తుంది.

355. అల్లం, వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

356. ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లలో పిండి వేశాక తడిచేత్తో అద్దితే సరిపోతుంది.

357. వరిపిండి, శనగపిండి లాంటివి కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

358. వంటగది గట్టు మీద జిడ్డు తొలగించాలంటే కాస్త వంటసోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుభ్రపడుతుంది.

359. కంద ముక్కలను ఉడికించే నీళ్ళలో చిన్న బెల్లం ముక్క వేస్తే అవి త్వరగా ఉడుకుతాయి.

360. కరివేపాకును కాడల నుంచి వేరుచేసి ఒక డబ్బాలో పోసి ఫ్రిజ్ లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

361. మసాలా రుబ్బిన తర్వాత మిక్సీ జార్ నుంచి ఆ వాసన పోవాలంటే ఎండిపోయిన బ్రెడ్ ముక్కలు వేసి పొడిచేస్తే సరి.

362. కరివేపాకు పొడి చేసేటప్పుడు కొన్ని వేయించిన నువ్వులు కలిపితే పొడి మరింత రుచిగా ఉంటుంది.

363. కరివేపాకు పొడి చేసేటప్పుడు కొన్ని వేయించిన నువ్వులు కలిపితే పొడి మరింత రుచిగా ఉంటుంది.

364. బఠానీలలో చిటికెడు వంట సోడా కలిపితే అవి పొంగకుండా ఉంటాయి. త్వరగా ఉడుకుతాయి.

365. కర్పూరాన్ని నిల్వ చేసిన డబ్బాలో నాలుగు మిరియాలు వేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

366. కూరలు చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.

367. మరీ జిడ్డు పేరుకుపోయిన పాత్రలని తోమడానికి ఉప్పులో ముంచిన నిమ్మ చెక్కలతో తోమి పాత పత్రికలతో రుద్దితే సరి.

368. ఉల్లిపాయలను సులువుగా పొట్టు తీయాలంటే గంటపాటు నీళ్ళలో నానబెట్టాలి.

369. పచ్చిమిర్చిని కోసాక పంచదార కలిపిన చల్లటి నీళ్ళతో చేతుల్ని కడిగితే మంటగా ఉండదు.

370. ఆకుకూరల్ని వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే కూర సహజరంగును కోల్పోదు.

371. ఆలుగడ్డ (బంగాళాదుంప) ముక్కల్ని ఉప్పు నీళ్ళలో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి.

372. తరిగిన ఆలుగడ్డలు (బంగాళాదుంపలు) రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై కొద్దిగా వెనిగర్ చల్లండి.

373. కొబ్బరి చట్నీ చేసేటపుడు అందులో నీళ్ళకు బదులు పాలు పోస్తే మరింత రుచిగా ఉంటుంది.

374. బెండకాయ ముక్కలను ఉప్పుతో రుద్ది కడిగితే కూరలో జిగురు రాదు.

375. గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బు నీళ్ళలో వెనిగర్ కలిపి రుద్దితే పోతాయి.

376. టమాటా సూప్ కు మంచి రంగు రావాలంటే అందులో బీట్ రూట్ ముక్క వేయాలి.

377. వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.

378. ఫ్రిజ్ లో పెట్టిన పనీర్ గట్టిపడితే వేడినీటిలో ఐదు నిమిషాలు ఉంచి తీస్తే సరి.

379. కొత్తిమీర, పుదీనా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే అల్యూమినియం ఫాయిల్ లో నిల్వ చేయాలి.

380. చేతులు ఉల్లిపాయ వాసన వస్తుంటే, నిమ్మ చెక్కతో రుద్ది శుభ్రపరచుకుంటే వాసన వదిలిపోతుంది.

381. కూరల్లో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యం పిండి కలపండి. రుచిగా వుంటుంది.

382. బియ్యం, శనగ పిండిని పాలిథీన్ సంచిలో పెట్టి, ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

383. పిండిని నిల్వ ఉంచిన డబ్బాలో కరివేపాకు వేసి మూతపెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

384. థర్మోఫ్లాస్క్ లో టీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే లోపలి భాగం రంగు మారుతుంది. అలాంటప్పుడు దాన్ని వెనిగర్ తో శుభ్రపరిస్తే మామూలు రంగుకు వస్తుంది.

385. పులుసు కూరల్లో చింతపండు రసానికి బదులు టమాటా గుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి.

386. వెల్లుల్లి పొట్టు సులువుగా తీయాలంటే వాటిని గంటపాటు చల్లటి నీళ్ళలో నానబెట్టాలి.

387. తేమకు అగ్గిపెట్టె మెత్తబడితే అందులో చెంచా బియ్యం గింజలు వేస్తే పుల్లలు త్వరగా మండుతాయి.

388. కిలో గోధుమలలో గుప్పెడు శనగలు చేర్చి మర పట్టిస్తే చపాతీలు తెల్లగా ఉంటాయి. చక్కటి రుచి వస్తుంది.

389. బత్తాయి రసం తీసి, గింజలను వేరు చేశాక, మిగిలిన గుజ్జులో పంచదార కలుపుకొని తింటే రుచికరంగా ఉంటుంది. చక్కటి పోషకాలు అందుతాయి.

390. పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా తయారయితే దాని మీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగమీద ఉంచి చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది.

391. స్నాక్ వంటకాల్లో కారానికి బదులు మిరియాల పొడి వేస్తే రుచిగా ఉంటుంది.

392. ఫ్లాస్కులని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగితే సరి.

393. బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండకట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టించండి.

394. పిండి వంటలు చేసేటపుడు మూకుడులో నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.

395. ఇంగువ గడ్డ కడితే, ఆ డబ్బాలో నాలుగు పచ్చి మిరపకాయలు వేస్తే పొడిగా అవుతుంది.

396. వంటకాల్లో సుగంధాలను అలాగే వేయడానికి బదులు, పొడిచేసి వేస్తే పదార్థాలు మరింత కమ్మటి వాసన వస్తాయి.

397. ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే త్వరగా వేగుతాయి. కూర కూడా మరింత రుచిగా ఉంటుంది.

398. అరటి, ఆలుగడ్డ (బంగాళాదుంప) ముక్కల మీద ఉప్పునీళ్ళు చల్లి పావుగంటయ్యాక వేపుడు చేస్తే, ముక్కలు బాగా వేగుతాయి.

399. వెల్లుల్లి రెబ్బల్ని గంటపాటు నీళ్ళలో నానబెట్టి పొట్టుతీస్తే సులువుగా వస్తాయి.

400. పెరుగు పుల్లగా వుంటే అందులో నాలుగు పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తే పులుపు తగ్గుతుంది.

401. ఇడ్లీలకి మినప్పప్పు రుబ్బుతున్నప్పుడు పావుకిలో పప్పుకి అరచెంచా మెంతులు వేసి రుబ్బితే ఇడ్లీలు మృదువుగా వస్తాయి.

402. బెండకాయ, వంకాయ… వంటి కూరలు రుచిగా ఉండాలంటే నూనెలో కాస్త మొక్కజొన్నపిండి కలపండి.

403. మిగిలిపోయిన బ్రెడ్ ను కాసేపు ఓవెన్ లో ఉంచి పొడిచేసి పులుసుల్లో వేసుకుంటే రుచిగా ఉంటుంది.

404. తీపి వంటకాల్లో ఉపయోగించడానికి ఎండు ద్రాక్షలను తరగాలంటే వాటిపై కొద్దిగా బియ్యపు పిండి చల్లండి. కత్తిరించడం సులభం అవుతుంది.

405. జిగురు ఎండిపోతే కొద్దిగా వెనిగర్ కలిపి చూడండి.

406. నిల్వ పచ్చళ్ళకు ఆవనూనెను వాడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

407. లేత మొక్కజొన్న గింజలకు చిటికెడు పంచదార చేర్చి ఉడికిస్తే మరింత రుచిగా ఉంటాయి.

408. కూరగాయ ముక్కలను ఉడికించేటపుడు అందులో రెండు చెంచాల పాలు కలిపితే అవి రంగు మారవు.

409. మూకుడుకు పదార్థాలు అంటుకోకుండా ఉండాలంటే, ముందు బాగా వేడిచేసి ఆ తరువాత నూనె వేసి వేయించండి.

410. కొబ్బరి ఉండలు చేసే ముందు… ముక్కలను ఫ్రిజ్ లో ఉంచి తరువాత మిక్సీ పడితే పొడి చక్కగా వస్తుంది.

411. సలాడ్ లోని కూరముక్కలు కరకరలాడాలంటే… వాటిని కాసేపు చల్లని నీటిలో ఉంచి చూడండి.

412. బిర్యానీ కోసం బాస్మతీ బియ్యం వండుతున్నప్పుడు చెంచా నిమ్మరసం, అరచెంచా నెయ్యి కలపండి. అన్నం పొడిపొడిగా… చక్కగా అవుతుంది.

413. తరిగిన దుంప కూరల్ని కాసేపు ఉప్పునీటిలో ఉంచండి. త్వరగా ఉడుకుతాయి.

414. పిల్లలు తీసుకెళ్ళే టిఫిన్ డబ్బాలను నిమ్మచెక్కతో రుద్దితే పదార్థాల తాలూకు వాసనలు రావు.

415. ఉల్లి, వెల్లుల్లి కోసిన వెంటనే ఆ చాకును నిమ్మరసంతో కడిగేయండి. వాటి తాలూకు వాసన వదిలిపోతుంది.

412. నిమ్మరసం మిగిలిపోతే అందులో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రిజ్ లో ఉంచండి. రెండు మూడు రోజులు వాడుకోవచ్చు.

413. నీళ్ళలో కాసిని పచ్చిపాలు కలిపి వెండి సామగ్రిని కడిగితే… మురికి సులువుగా వదిలిపోయి శుభ్రపడతాయి.

414. బెండకాయ కూరలో కాస్త పెరుగు లేదా నాలుగు చుక్కల నిమ్మరసం జోడిస్తే జిగురు రాకుండా ఉంటుంది.

415. పిండిలో పావుకప్పు వేయించిన సేమియా వేస్తే గారెలు మరింత రుచిగా ఉంటాయి.

416. అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.

417. వండిన మూకుడులో పదార్థాలు అంటుకుపోతే… అందులో సబ్బునీళ్ళు పోసి కొద్దిసేపు మరిగించి శుభ్రపరిస్తే సరి.

418. కప్పు అడుగు భాగంలో టీ మరకలు ఎండిపోతే… కాస్త ఉప్పు చల్లి నీళ్ళు పోసి నానపెడితే అవి సులువుగా వదిలిపోతాయి.

419. జీడిపప్పు, బాదం, ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్షల్ని ఒకరోజు ఎండబెట్టి డబ్బాల్లోకి మార్చుకోవాలి. ఇలా చేస్తే ఆరు నెలల వరకు పురుగు పట్టకుండా ఉంటాయి.

420. నిమ్మకాయల్ని న్యూస్ పేపర్లలో చుట్టి పాలిథీన్ కవర్లలో వేసుకోవాలి. ఇలా చేస్తే నెల రోజుల వరకు అంతే తాజాగా వుంటాయి.

421. క్యారెట్లను శుభ్రంగా కడిగి రెండువైపులా కొద్దిగా తరిగి బాగా ఆరనివ్వాలి. ఇలా తరిగిన క్యారెట్లను నూలు వస్త్రంలో చుట్టి ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటే నెల వరకూ వాడుకోవచ్చు.

422. ఆకు కూరల్ని తడి నూలు వస్త్రంలో చుడితే నాలుగు రోజుల వరకూ అంతే తాజాదనంతో ఉంటాయి. వస్త్రం తడి ఆరినప్పుడల్లా కొద్దిగా నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది.

423. వాడినట్టున్న కూరగాయల్ని రాత్రంతా నీటిలో వేసి ఉంచితే చాలు మర్నాటికి అప్పుడే కొన్న వాటిలా తాజాగా మారిపోతాయి.

424. గోధుమ, ఉప్మా, రవ్వల్ని నిల్వ చేస్తున్నప్పుడు ముందుగా దోరగా వేయించండి. ఆ తరువాత డబ్బాల్లోకి మార్చుకుంటే… చీమలు పట్టకుండా ఉంటాయి.

425. గ్రేవీ చిక్కగా తయారు కావాలంటే ముందుగా చిటికెడు వంటసోడా కలపండి దగ్గరగా అవుతుంది.

426. దోశ, ఇడ్లీ పిండిలో చెంచా ఆలివ్ నూనె జోడించారంటే… పిండి గట్టిగా అవ్వదు.

427. సూప్, గ్రేవీల తయారీలో నీళ్ళు ఎక్కువయ్యాయా? వేయించి పొడిచేసిన బ్రెడ్ పొడిని కలిపి చూడండి. వంటకం నిమిషాల్లో చిక్కగా అవుతుంది.

428. తేయాకులను పెనం మీద వేడిచేసి చల్లారాక పొడిచేసి డికాక్షన్ లో కలిపితే టీ మరింతగా రుచిగా ఉంటుంది.

429. ఇంట్లో చేసుకొనే టమాటా సూప్ కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్ రూట్ ముక్క వేస్తే రంగూ, పోషకాలూ రెండూ అందుతాయి.

430. చీజ్ నిల్వ చేసే డబ్బాలో చిన్న పటిక బెల్లం ముక్క ఉంచండి. ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

431. కోసిన ఉల్లిపాయలు సగమే వాడినప్పుడు పాడవడం, పడేయటం జరుగుతోందా? అయితే వాడగా మిగిలిన దానికి కాస్త వెన్న రాసి చూడండి. తాజాగా ఉంటుంది.

432. వేడిచేసిన గరిటెతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా తాజాగా ఉంటుంది.

433. బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పట్టదు.

434. పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి వేస్తే సరిపోతుంది.

435. కూరల్లో, పులుసులో ఉప్పు, కారం ఎక్కువైనప్పుడు రెండు చెంచాల శనగపిండిని వేయించి కలిపితే సరి.

436. మరీ నిల్వ ఉంచిన శనగపిండిని పారవేయకుండా స్టీలు గిన్నెలు, వెండి సామాన్లను తోమితే చక్కగా శుభ్రపడతాయి.

437. మజ్జిగ పల్చనయితే పడి కర్వేపాకు రెబ్బలు, కాస్త ఉప్పూ కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే చిక్కబడతాయి.

438. వెన్న కాచేటప్పుడు నెయ్యి తాజాగా ఉండి మంచి వాసన వస్తూ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే, వెన్నలో ఓ తాజా తమలపాకును వేసి కాచితే సరి.

439. బాస్మతీ బియ్యం వండుతున్నప్పుడు కొద్దిగా నిమ్మరసం అరచెంచా నెయ్యి వేసిచూడండి. మెతుకులు మరీ ముద్దగా, నూకల్లా కాకుండా వస్తాయి.

440. ఒకసారి చేసిన వడల్ని మళ్ళీ వేయిస్తుంటే… నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. దీన్ని నివారించేందుకు వడల్ని ఒక నిమిషం మాత్రమే వేయించండి. ఆ వెంటనే… టిష్యూ కాగితంపై ఉంచండి. అధిక నూనె సమస్య ఉండదు. కరకరలాడుతూ వస్తాయి.

441. కాకరకాయ ముక్కల్ని రెండుగా విరిచి నిల్వ చేయడం వల్ల ఎక్కువ రోజులు పండకుండా వుంటాయి.


442. పచ్చి అరటి ముక్కలను ఒక ఉడుకు రానిచ్చి తీసి వేయిస్తే అవి మృదువుగా వస్తాయి. రుచిగా ఉంటాయి.